Reading Time: 2 minutes

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామంలో పేద రైతుల భూములను ప్రభుత్వం ఇండస్ట్రీయల్ కారిడార్ పేరుతో బలవంతంగా లాక్కుంటుందని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కాళ్లాపూర్ రైతులు గురువారం పరిగి పట్టణంలోని కోడంగల్ చైరస్తా నుంచి బహార్‌పేట్, బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజాపూర్ జాతీయ రహాదారిపై రైతులు బైటాయించి పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలు చేశారు. వీరికి బిజేపి, బిఆర్‌ఎస్, సిసిఎం పార్టీ నాయకులు మద్దతూ ఇచ్చారు. దీంతో ధర్నా, రస్తారోకోకు మరింత బలం చేకూరింది. సిఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులు, మహిళ రైతులు, వృద్దులు, పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను బలవంతగా ధర్నా విరమింపజేసే ప్రయత్నం చేయగా పోలీస్‌లు, రైతుల మద్య వాగ్వాదాలు మిన్నంటాయి. ఒక్క సారిగా ఉధిృక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రైతులు, పోలీస్‌ల మద్య తోపులాటలు, ఘర్షణలు బలవంతంగా లాక్కెల్లటం వంటి దృశ్యాలు ధర్నా, రస్తారోకోలో కనిపించాయి. మా భూములు మాక్కావాలని రైతులు మొండి పట్టు పడ్డారు. ఉన్న భూములు కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడుతాయని అందుకు ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని పలువురు రైతులు కోరారు. పరిగి ఎస్‌ఐ మోహన్‌కృష్ణ కాళ్లు ఓ రైతు పట్టుకుని మొక్కారు. మాకు న్యాయం చేయాలని పోలీస్‌ల కాళ్లు పట్టుకున్నారు. ఈ ధర్నాతో వాహానాలు రోడ్డుపై ఇరు వైపుల భారీగా నిలిచిపోయాయి. ఈ ధర్నాకు బిజేపి, బిఆర్‌ఎస్, సిపిఎం నాయకుల సంపూర్ణ మద్దతూ తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, బిజేపి జిల్లా కార్యదర్శి పెంటయ్యగుప్త, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బేత్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్‌లు రవికుమార్, మీదిగడ్డ శ్రీనివాస్‌లు పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాలకు చెందిన 1197 ఎకరాల భూమి అభివృద్ది పేరుతో భూ సేకరణ చేయడం వెంటనే నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. కాళ్లాపూర్ గ్రామంలో పేద రైతుల పంట భూములను ఇండస్ట్రీయల్ కారిడార్ పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయమన్నారు.

ఈ భూములే రైతులకు జీవనాధారం వాటిని కోల్పోతే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉందని అవేదన వ్యక్తం చేశారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయకుండా ముందుకు సాగడం చట్ట విరుద్దమని అన్నారు. రైతుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నోటిఫీకేషన్ జారీ చేయడం ప్రజా స్వామ్యానికి విరుద్దమన్నారు. తక్షణమే భూ సేకరణ ప్రక్రియను నిలిపి వేసి, ఇప్పటి వరకు జారీ చేసిన నోటిఫీకేషన్‌ను రద్దు చేయాలని, రైతుల హక్కులను రక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతరం తహాశీల్‌దార్ కార్యాలయం వద్దకు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి పరిగి తహాశీల్‌దార్ వెంకటేశ్వరికి వినతి పత్రం సమర్పించారు.