
ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ కొరతతో అల్లాడుతున్న ప్రజలపై మరోభారం పడింది. గ్యాస్ కొరత కారణంగా సకాలంలో సిలిండర్‌లు అందక తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌మార్కెట్‌లో మూడు రెట్లు అధికధరలు పెట్టి కొనుగోలు చేస్తున్న సామాన్యులపై వంటనూనెల పెంపు మరింత అగాధంలోకి నెడుతోంది. లీటర్ మంచినూనెపై ఏకంగా రూ.30 రూపాయలు పెంచడం విశేషం. గత నెలక్రితం రూ.152 ఉన్న లీటర్ మంచినూనె ధర ప్రస్తుతం రూ.182కి చేరింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్యాస్,పెట్రోల్,డిజిల్ కొరత రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఒక్కొక్కటిగా నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వంటనూనెలతో పాటు త్వరలో మరిన్ని నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటుండటం విశేషం.
కిలో కట్టెలు ఏకంగా రూ.30 : నిన్నటివరకు కిలో కట్టెల ధర రూ. 9 ఉండగా, ఏకంగా రూ.30కి చేరింది. డోమెస్టిక్,కమర్షియల్ సిలిండర్‌ల కొరత కారణంగా బ్లాక్‌మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.3వేలు, కమిర్షియల్ సిలిండర్ ధర రూ.7వేలు పలుకుతున్న విషయం తెలిసిందే. పెరిగిన ధరలతో ఇప్పటికే నగరంలో రెండువేలకు పైగా హోటళ్లు మూసివేయగా, కొన్ని హోటళ్లు గ్యాస్ ధరలు అదనంగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కట్టెలకు భారీగా డిమాండ్ పెరగడంతో కట్టెలవ్యాపారులు భారీగా ధరలు పెంచారు. కిలో కట్టెల ధరలను ఏకంగా రూ.21 పెంచడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.