Reading Time: < 1 minute

పాట్నాటాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికునికి అందజేసిన భోజనం లోని పెరుగు ప్యాకెట్‌లో పురుగులు ఉండడం తీవ్ర దుమారం రేపింది. దీంతో రైల్వేశాఖ సంబంధిత కంపెనీకి రూ. 50 లక్షల జరిమానాతోపాటు కాంట్రాక్టు నుంచి రద్దు చేసింది. ఈ సంఘటనకు తీవ్రంగా స్పందించిన రైల్వే మంత్రిత్వశాఖ తన స్వంత కంపెనీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి)ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని ఆక్షేపిస్తూ రూ.10 లక్షల జరిమానా విధించింది. మార్చి 15న ఏడుగురు ప్రయాణికుల బృందం వందేభారత్‌లో ప్రయాణిస్తుండగా,వారికి భోజనంతోపాటు అందించిన పెరుగు ప్యాకెట్‌లో పురుగులు కనిపించాయి. ప్రయాణికుడు రితేష్ సింగ్ తక్షణం ఈ అంశాన్ని తన ఎక్స్ ద్వారా ఐఆర్‌సిటిసికి, రైల్వే మంత్రికి , ఇతరులకు పంపించారు.

సంఘటనకు స్పందించి రైల్వే ఐఆర్‌సిటిసి చర్యలు తీసుకుని సమర్పించిన నివేదికలో ఆ పెరుగు ప్యాకెట్ పాట్నా నుంచి సేకరించినట్టు, ఈఏడాది మార్చి 9న దానిని తయారు చేయగా, ఎక్స్‌పైరీ తేదీ ఏప్రిల్ 7న ఉన్నట్టు వివరించింది. ప్రయాణికులకు అధికారులు క్షమాపణ చెప్పి డ్రైఫ్రూట్ మిక్సర్ , కొన్ని స్వీట్లు అందజేశారు. నివేదిక ప్రకారం వెండర్ క్రిష్ణా ఎంటర్‌ప్రైజెస్‌కు మొదట రూ. 25000 జరిమానా విధించి నిర్లక్షానికి హెచ్చరించారు. కానీ ఈ చర్యకు రైల్వే మంత్రిత్వశాఖ సంతృప్తి చెందలేదు. సంబంధిత క్రిష్ణా ఎంటర్‌ప్రైజెస్ కాంట్రాక్టును బుధవారం రద్దు చేసింది. జరిమానాను రూ. 25,000 నుంచి రూ. 50 వేలకు పెంచింది. తన స్వంత సంస్థ ఐఆర్‌సిటిసికి రూ.10 లక్షల జరిమానా విధించింది. ప్రయాణికుల భద్రత,రైల్వే సౌకర్యాల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వేశాఖ వివరించింది.