
అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవంలో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేసిన ‘భగవంత్ కేసరి’ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా అవార్డుని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చలనచిత్రోత్సవ కార్యక్రమంలో ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవంలో పాల్గొనడం, పురస్కారాన్ని స్వీకరించడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా ‘భగవంత్ కేసరి’ సినిమాని ప్రదర్శించడం గర్వంగా ఉంది”అని అన్నారు.