
ఇరాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ ఎలైట్ నౌకాదళ విభాగానికి అధిపతిగా ఉన్న అలీరెజా టాంగ్సిరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన నిజమైతే, ఇరాన్ సైనిక నాయకత్వానికి, ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన పర్షియన్ గల్ఫ్‌లోని నౌకా కార్యకలాపాలకు గట్టి దెబ్బే. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో టాంగ్సిరి మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపాడు. ప్రస్తుతం నాలుగో వారంలోకి ప్రవేశించిన యుద్ధంలో ఇది మరో కీలక మరణంగా భావిస్తున్నారు.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన టాంగ్సిరి,
బందర్ అబ్బాస్ పోర్టు నగరంలో జరిగిన దాడిలో హతమైనట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి మూసివేతకు సంబంధించిన చర్యలను పర్యవేక్షించే బాధ్యత టాంగ్సిరిదేనని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్ నియంత్రణ వల్ల మధ్యప్రాచ్యం నుంచి చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) కూడా ఈ దాడిపై స్పందించలేదు.
అలీరెజా టాంగ్సిరి
ఇరాన్ దక్షిణంలోని బుషెహర్ ప్రావిన్స్‌లో జన్మించిన అలీరెజా టాంగ్సిరి, ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో సేవలందిస్తూ ఐఆర్‌జీసీ నౌకాదళంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో జరిగిన ట్యాంకర్ వార్స్‌లో కూడా పాల్గొన్నారు. తర్వాత బందర్ అబ్బాస్‌లోని ఐఆర్‌జీసీ మొదటి నౌకాదళ జిల్లాకు కమాండర్‌గా పనిచేసిన ఆయన, 2010 నుంచి 2018 వరకు ఉప కమాండర్‌గా సేవలందించారు. అనంతరం నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
యుద్ధంలో కీలక నేతల వరుస హత్యలు
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు హత్యకు గురవుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత ప్రభావం చూపిన ఘటనగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం నిలిచింది. అనంతరం ఇస్లామిక్ రిపబ్లిక్ రాజకీయ, సైనిక ఉన్నత స్థాయి నాయకత్వంపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయి. మార్చి 17న ఇరాన్ భద్రతా వ్యవస్థ అధిపతి అలీ లరిజానీ, టెహ్రాన్ పరిసరాల్లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇక కొద్ది రోజులకే రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ, అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హతమయ్యారు. యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరాన్ క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తగ్గలేదని జాతీయ టెలివిజన్‌లో వెల్లడించిన కొన్ని గంటలకే ఆయన మృతి చెందడం గమనార్హం.