
వరకట్నం చావుల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు అత్యంత దారుణాలు. సభ్య సమాజానికి చెరగని మచ్చలు అని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. ఓ వైపు వరకట్నం పద్థతిపై చట్టపరమైన నిషేధం అమలులో ఉంది. అయితే తెరవెనుక ఈ దురాచారం సాగుతూనే ఉంది. దీనితో వరకట్నం వేధింపులతో వేలాది మంది మహిళలు అకాలమరణం చెందుతున్నారు. ఇది అమానుషం అని తెలిపారు. ఓ వరకట్నం చావు కేసులో వ్యక్తి బెయిల్‌ను రద్దు చేస్తూ బెంచ్ ఈ సామాజిక సమస్య గురించి ప్రస్తావించింది. నిందితుడికి పాట్నా హైకోర్టు బెయిల్ ఎందుకు మంజూరీ చేసిందో అర్థం కావడం లేదు. ఈ బెయిల్ పూర్తి స్థాయిలో కొట్టివేయదగినది. నిలువజాలనిది అని స్పష్టం చేశారు. వరకట్నం చావు వంటి ఉదంతాలలో నిందితులను క్రూర నేరాలకు పాల్పడిన వారిగా పరిగణించాల్సి ఉంటుంది.
అటువంటి వారికి బెయిల్ మంజూరీల దశలో హైకోర్టు ఇతర కోర్టులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. విచక్షణారహిత స్పందన అనుచితం అవుతుందని పేర్కొన్నారు. వరకట్నం చావుల విషయంలో తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘనలు, జీవన మర్యాదల విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వరకట్నం వేధింపులతో హత్యలు, ఆత్మహత్యలకు పురికొల్పడం వేలాది మంది అబలల విషాదాంతానికి దారితీస్తోంది. సమాజం నగుబాటుకు దారితీస్తుందని ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు తమ ముందుకు వచ్చిన కేసులో హైకోర్టు తీరు దారుణంగా ఉంది. అన్ని విషయాలను పూర్తిగా సమీక్షించుకోకుండానే బెయిల్ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇది ఏం సంకేతాలకు దారితీస్తుంది? అని నిలదీశారు. 2024లో వరకట్న బాధితురాలు అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా గుర్తించారు. శరీరం అంతటా బలీయమైన గాయాలు ఉన్నాయి. తలకు గాయం అయ్యి, రక్తస్రావం కావడంతో చనిపోయినట్లు నిర్థారించారు. దారుణ ఘటనపై న్యాయస్థానం స్పందన సరిగ్గాలేదని మందలించారు.