Reading Time: < 1 minute

రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకులు కట్‌చేసి తాము చెప్పాలనుకున్న వాస్తవాలను సభ దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని అన్నారు. ఆరోగ్యశ్రీ ఖర్చుల పెంపుపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, 2014 జూన్ 2 నాటికి ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.32 కోట్లు ఖర్చయ్యేవి అని, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. కానీ.. ప్రభుత్వం రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోందని అన్నారు. జనాభా పెరుగుదల,

వైద్య ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ పెంపు సహజం అని, ఇందులో కాంగ్రెస్ కొత్తగా సాధించిన ఘనతేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, పనులు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆస్పత్రులన్నీ పూర్తయి ప్రజలకు మెరుగైన సేవలు అందేవి అని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ అదాయంలో వాటాను పెంచి నిధులను సమకూర్చిందని తెలిపారు. ఈ అంశాలు అన్నీ చెప్పాలని అనుకుంటే సభలో తమకు మైక్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.