Reading Time: < 1 minute

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరిట మోసాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్ వెంకట రామన్, అభిషేక్, విలియమ్స్, మన్మీత్ శర్మ ముఠాగా ఏర్పడి రూ.26 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. క్లోజ్‌ ఎక్స్ పే, ట్రస్ట్లీ పే, అకల్ట్ పే పేర్లతో నకిలీ పేమెంట్ గేట్‌వేలను నిందితులు తయారు చేసినట్లు విచారణలో తేలింది. యుపిఐ, ఐఎంపిఎస్ కార్డ్ ట్రాన్సాక్షన్‌ల ద్వారా డబ్బులు మళ్లించినట్లు వెల్లడైంది. ప్రతి లావాదేవిపై 2 శాతం నుంచి 5 శాతం వరకు కమిషన్ వసూలు చేసినట్లు గుర్తించారు. ఫేక్ కంపెనీల పేర్లతో మ్యూల్ ఖాతాలు సృష్టించి, నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సూర్యోదయ బ్యాంక్ ద్వారా పేమెంట్ గేట్‌వే సేవలు వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు. నిందుతుల నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్స్, 9 చెక్‌బుక్‌లు, రూ.6.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.