Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ధురంధర్2’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగం ఎలా సూపర్ హిట్ అయిందో.. రెండో భాగం అంతకంటే ఎక్కువ సక్సెస్‌ని అందుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. దక్షిణాది నటులు, దర్శకులు సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన రియాక్షన్ మాత్రం చాలా తక్కువ.

అయితే ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ ఈవెంట్‌లో పాల్పొన్న ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా ధురంధర్2 గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఆ సినిమాకు వస్తున్న ప్రశంసలు విన్నాను. మొన్న ‘ధురంధర్1’.. ఇప్పుడు ‘ధురంధర్2’ అద్భుత విజయాన్ని అందుకున్నాయి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. దీంతో బాలీవుడ్ అగ్ర తారాగణంలో ధురంధర్ గురించి మాట్లాడిన ఏకైక నటుడిగా ఆమిర్ నిలిచారు.