
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్ పిజి సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. సిలిండర్లు బుకింగ్ అయినా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత మరోసారి కనిపింది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈక్రమంలో గ్యాస్ ఆటో నుండి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. ఈ ఘటన ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ లో చోటుచేసుకుంది. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా కొందరు సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే ఏజెన్సీ సబ్బంది, స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.