
హైదరాబాద్: దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలు ప్రభుత్వం కుదుర్చుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రానికి రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దావోస్ పెట్టుబడులపై శ్రీధర్ బాబు మాట్లాడారు. పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని, 2024 దావోస్ లో 18 ఎంవొయూలు.. రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలియజేశారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు జరిగిందని, భూముల కేటాయింపుతో ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం కేటాయించామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూముల గుర్తింపు జరిగిందని, నిజామాబాద్ ఐటీ టవర్ లో 11 కంపెనీలు కార్యకలాపాలు జరిపాయని అన్నారు. నిజామాబాద్ లో 681 సీట్ల సామర్థ్యంతో ఐటి టవర్ నిర్మించామని, నిజామాబాద్ ఐటీ టవర్ లో ప్రస్తుతం 276 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారని అన్నారు. పెట్టుబడుల ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, పరిశ్రమల ఏర్పాటు వల్ల రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు, ఉపాధి లభిస్తుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.