Reading Time: < 1 minute

హైదరాబాద్: పాత బకాయిలను సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బకాయిలు ఉన్నవాటిలో కూడా ఎక్కువ ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పాత బకాయిల విషయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించామని, రూ. 2,408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశాం అని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రులకు ప్రతినెల 30 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 55 కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ బకాయిల భారం మోస్తూనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం అని అన్నారు.

ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టామని, రూ. 2040 కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద చెల్లించాం అని రేవంత్ పేర్కొన్నారు. టీచింగ్ కాలేజీలకు పేషెంట్లు రావడం లేదని, పేషెంట్లు వెళ్లే దగ్గర ప్రొఫెషనల్స్ లేరని విమర్శించారు. టీచింగ్ కాలేజీల్లో చదువు చెప్పే ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే వారికి ఇన్సెంటీవ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని.. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తాం అని అన్నారు. విదేశాల్లోని ప్రముఖ వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం అని.. ఉస్మానియా నూతన భవనాన్ని గోషామహల్ లో రూ.3 వేల కోట్లతో నిర్మిస్తున్నాం అని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రతిరోజు మెడికల్, హెల్త్ విభాగాల్లో సవాళ్లు ఎదురవుతాయని సూచించారు. తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, విద్యా, పేదల వైద్యం.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని అన్నారు. ఎవరి పిఎలు నిధులను దుర్వినియోగం చేశారో తేలుస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.