
కడియం శ్రీహరి బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన నిజాయితీ గల నాయకుడు కాదని తీవ్రంగా విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం శ్రీహరి చెప్పుకోవడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేవాదుల ప్రాజెక్టు కోసం కడియం శ్రీహరి ఎలాంటి పాత్ర పోషించలేదని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తానే సృష్టికర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కడియం శ్రీహరికి మాజీ సిఎం కెసిఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఎంపీ, డిప్యూటీ సిఎం, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎ వంటి కీలక పదవులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. ఇక డీలిమిటేషన్ జరిగినా జనగామ ప్రజలకు సేవ చేయడం కొనసాగిస్తానని,అక్కడి ప్రజలతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.