Reading Time: < 1 minute

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డెక్కన్ ట్రేడర్స్ గోదాములపై పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, ఫుడ్ అడల్టరేషన్ విభాగం అధికారులు కలిసి ఈ తనిఖీలు చేశారు.

నిందితులు ముగ్గురు కలిసి ఎం.ఎం.పహాడీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గోదాంలు నడుపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ప్రమాదకరమైన పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి.. హైదరాబాద్ నగరంలో హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.