Reading Time: 2 minutes

ఫిలిప్పీన్స్‌లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన.. ఇరాన్ -ఇజ్రాయిల్ దాడుల భయంతో అధ్యక్షుడి కీలక నిర్ణయం!

Caption of Image.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతాయన్న భయంతో, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఫిలిప్పీన్స్  దేశంలో ‘నేషనల్ ఫ్యూయల్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. దింతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

ఈ అత్యవసర పరిస్థితి ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. చమురు నిల్వలు తగ్గకుండా ఉండేందుకు, అవసరమైతే వేరే దేశాలకు ముందే డబ్బులు చెల్లించి మరీ ఇంధనాన్ని కొనుగోలు చేసే అధికారం ప్రభుత్వం పొందింది. అలాగే పెట్రోల్, డీజిల్‌ను అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ ధరలకు అమ్మడం వంటి వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆహారం, మందులు ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తే 
దేశంలో ప్రస్తుతం మరో 45 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇంధన నిల్వలను పెంచుకోవడానికి ప్రభుత్వం ఆగ్నేయాసియా దేశాల నుండి 10 లక్షల బ్యారెళ్ల చమురును సేకరించే ప్రయత్నంలో ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ సహా వెనిజులా నుండి చమురు కొనుగోలు చేసే అవకాశం కోసం ఫిలిప్పీన్స్ ప్రయత్నిస్తోంది.

Also Read : 24 గంటల్లోనే ఢిల్లీ అసెంబ్లీకి రెండో సారి బాంబు బెదిరింపు

ప్రజల నుండి  విమర్శలు 
ప్రభుత్వం ప్రకటించిన ఈ అత్యవసర పరిస్థితిపై రవాణా సంఘాలు, విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేవలం అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే సరిపోదు… పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్ పన్ను, వ్యాట్ (VAT)లను తక్షణమే రద్దు చేసి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

 ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ రవాణా కార్మికులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. చమురు కంపెనీలు వాళ్ళ ఇష్టానుసారం ధరలు పెంచకుండా కఠినమైన నియంత్రణ ఉండాలని కోరుతున్నారు.
 
అయితే పెరిగిన ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ప్రస్తుతం కొన్ని చర్యలు చేపట్టింది. విద్యార్థులు, కార్మికులకు కొన్ని నగరాల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు  డ్రైవర్లకు, రవాణా కార్మికులకు సుమారు 5,000 పెసోల (రూ.7,000పైగా) నగదు సాయం (సబ్సిడీ) ఇవ్వనుంది. 

©️ VIL Media Pvt Ltd.