Reading Time: < 1 minute

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపు కేసు వదలడం లేదు. దానం పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పును బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత 2024లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని ఏలేటి పిటిషన్‌లో పేర్కొన్నారు.

దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ‘బి-ఫాం’ దాఖలు చేశారని, ఏఐసిసి ప్రకటించిన జాబితాలోనూ దానం పేరు ఉందని పిటిషనర్ ఏలేటి పేర్కొన్నారు. కాబట్టి దానంపై స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టి వేసి, ఇంత కాలం ఎమ్మెల్యేగా పొందిన జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దానం నాగేందర్‌తో పాటు పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. మిగతా తొమ్మిది మంది ఊపిరి పీల్చుకున్నారు.