
- రూ.10 కోట్లతో మౌలిక వసతులు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. కొందరు వ్యక్తులు భూదాన్భూములను ఆక్రమించుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో సుమారు 600 ఇండ్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం కూల్చివేసింది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ చేసి అర్హులైన వారిలో 301 మందికి ఈ ఏడాది మార్చిలో 75 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇండ్లను సైతం మంజూరు చేసింది.
వెలుగుమట్లలో గుడిసెలు వేసుకొని ఉన్న వారిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్వంత స్థలాలు కలిగిన 101 మందికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. వారు కూడా ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటుండగా, వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణాలు స్పీడ్ గా జరుగుతున్నాయి.
టార్గెట్ డిసెంబర్9 వెలుగుమట్లలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సౌకర్యం, ప్రహరీ, పార్కు, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, అంగన్ వాడీ సెంటర్, స్ట్రీట్ లైట్లు, ప్రాథమిక పాఠశాల వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు చేసుకుంటుండగా, ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు, స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు. మిగిలిన వసతులు, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ 9న వెలుగుమట్ల కాలనీని ప్రారంభించాలని ఆఫీసర్లు టార్గెట్ గా పెట్టుకున్నారు.
లబ్ధిదారులకు రుణసాయం
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారిలో కొంత మంది ముందుగా పెట్టుబడి పెట్టేందుకు కూడా కష్టపడుతుండడంతో, వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణసాయాన్నిఅందించారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి వచ్చే ఇందిరమ్మ ఇంటి బిల్లుల నుంచి తిరిగి చెల్లించేలా ఒప్పించి రుణసాయం ఏర్పాటు చేశారు. 301 మందిలో 124 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున ఎస్‌హెచ్‌జీల నుంచి రుణాలు తీసుకున్నారు.
దీంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకునే అవకాశం కలిగింది. మరోవైపు తాము ఏళ్ల తరబడి వెలుగుమట్లలో గుడిసెలు వేసుకొని ఉన్నామంటూ దాదాపు 8 వేల మంది ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో ఇండ్ల స్థలాలు రాని వారిలో అర్హులకు ఇండ్లు మంజూరుకు చర్యలు తీసుకోనున్నట్లు హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ తెలిపారు.