Reading Time: < 1 minute

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ మాజీ ఎంపీకు క్లీన్‌చిట్… నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు..

Caption of Image.

మహిళా రెజ్లర్లు తనపై మోపిన లైంగిక వేధింపుల కేసులో బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఆయనతో పాటు ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న వినోద్ తోమర్ కూడా నిర్దోషిగా విడుదలయ్యారు.

ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ అనంతరం 2023 జూన్ 15న ఆయనపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి 2024 మే 10న ట్రయల్ కోర్టు ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. ఐదుగురు మహిళా రెజ్లర్లను వేధించడం, మహిళల పరువుకు భంగం కలిగించడం (ఐపీసీ సెక్షన్లు 354, 354A), అలాగే ఇద్దరు రెజ్లర్లను బెదిరించడం (సెక్షన్ 506) వంటి నేరాలకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలు ఉన్నట్లు అప్పట్లో కోర్టు పేర్కొంది. అలాగే డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై కూడా బెదిరింపుల అభియోగాన్ని మోపింది.

అయితే, ఈ కేసుకు సంబంధించి మొదట్లో ఒక మైనర్ రెజ్లర్ కూడా బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. దీంతో పోక్సో చట్టం కింద నమోదు చేసిన కేసును పోలీసులు కొట్టేసి, కేసు విచారణను ముగించారు. తాజాగా మిగిలిన ఆరోపణలపై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు.. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఈ కేసు నుంచి పూర్తిగా నిర్దోషిగా విడుదల చేసింది.

©️ VIL Media Pvt Ltd.