Reading Time: 2 minutes

కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి.. 8 మంది మిస్సింగ్

Caption of Image.

తిరువనంతపురం/ న్యూఢిల్లీ: కేరళలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా చోటుచేసుకున్న పలు దుర్ఘటనల్లో 13 మంది గాయపడినట్లు సీఎం వి.డి. సతీశన్ ప్రకటించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 209 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 5,792 మందిని తరలించామని చెప్పారు. 

ఈ వర్షాల వల్ల 27 ఇండ్లు పూర్తిగా, 196 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పథనంతిట్ట, ఇడుక్కి, వయనాడ్, కొట్టాయం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. కన్నూర్ జిల్లా అయ్యంకున్నులో అత్యధికంగా 320 మి.మీ వర్షపాతం నమోదైంది. పథనంతిట్టలోని రాన్ని, అలప్పుజలోని కుట్టనాడ్ ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రజలు చిన్న పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రస్తుతం వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టిందని, రెస్క్యూ ఆపరేషన్లతోపాటు ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు ప్రారంభించామని రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్ తెలిపారు. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 2 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీ చేశారు. ఆకస్మిక వరదల ముప్పు ఉండటంతోపాటు తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

కేరళలో భారీ వర్షాలు సృష్టించిన విధ్వంసంపై లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. గల్లంతయిన వారు క్షేమంగా దొరకాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

బాధితులను ఆదుకోవడానికి, సహాయక, పునరావాస చర్యలను సమన్వయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రాహుల్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, వలంటీర్లు సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరారు. బాధితులందరికీ తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.