Reading Time: 2 minutes
Arshdeep Singh Picks Top 5 Indian Bowlers Leaves Out Jasprit Bumrah

Arshdeep Singh Top 5 Indian Bowlers: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన టాప్-5 భారత బౌలర్ల జాబితాను ఎంచుకున్నాడు. అయితే ఈ జాబితాలో ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాకు చోటు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రముఖ యూట్యూబర్ కృష్ణాంక్ అత్రే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అర్ష్‌దీప్.. టీమిండియా టాప్-5 బౌలర్లను ఎంచుకున్నాడు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ జాబితాలో వెటరన్ పేసర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌కు అర్ష్‌దీప్ అగ్రస్థానం కట్టబెట్టాడు.

భువనేశ్వర్ కుమార్‌కు నంబర్-1 స్థానం ఎందుకు ఇచ్చాడో కూడా అర్ష్‌దీప్ సింగ్ వివరించాడు. ‘భువీ భాయ్ నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైన బౌలర్. అందుకే కొంచెం పక్షపాతం ఉండొచ్చు. కొత్త బంతితో భువనేశ్వర్ చూపించే నియంత్రణ అద్భుతంగా ఉంటుంది. అతని స్వింగ్ బౌలింగ్‌ను నేను చాలా ఇష్టపడతాను. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అద్భుత ఆరంభాలు ఇస్తాడు. వికెట్స్ పడగొడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతాడు’ అని చెప్పాడు. రెండో స్థానంలో మహ్మద్ షమీని ఎంపిక చేశాడు. ‘ఏ పిచ్‌పై అయినా సీమ్ మూవ్‌మెంట్‌ను రాబట్టే అరుదైన నైపుణ్యం షమీకి ఉంది. అతని సీమ్ పొజిషన్, బౌలింగ్ టెక్నిక్ అసాధారణం. షమీ భాయ్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు’ అంటూ ప్రశంసించాడు.

అర్ష్‌దీప్ సింగ్ జాబితాలో మూడో స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ‘కుల్దీప్‌కు చాలా అరుదైన స్కిల్‌సెట్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తారు’ అని పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో యుజ్వేంద్ర చహల్‌కు చోటు కల్పించాడు. పంజాబ్ జట్టులో కలిసి ఆడుతున్న కారణంతో పాటు చహల్ వికెట్ల రికార్డు అద్భుతంగా ఉండటమే తన ఎంపికకు కారణమని చెప్పాడు. ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను అర్ష్‌దీప్ ఎంపిక చేశాడు. ‘అశ్విన్ భాయ్‌ను చివరి స్థానంలో ఉంచాలని నాకు లేదు. కానీ మిగతా స్థానాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అందుకే ఐదో స్థానంలో పెట్టాల్సి వచ్చింది. ఆయన గొప్ప బౌలర్. ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున నాకు తొలి కెప్టెన్ కూడా ఆయనే. ఈ విషయానికి వ్యక్తిగతంగా ఆయనకు క్షమాపణ చెబుతున్నా’ అని నవ్వులు పూయించాడు.

అయితే అర్ష్‌దీప్ సింగ్ తన జాబితాలో జస్ప్రీత్ బుమ్రాకు చోటు లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ అర్ష్‌దీప్ జాబితాలో అతడికి స్థానం దక్కకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 52 టెస్టులు, 91 వన్డేలు, 95 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 500లకు పైగా వికెట్స్ పడగొట్టాడు.