
చిట్టీల పేరుతో అమాయకుల నుంచి అందిన కాడికి దండుకున్నారు దంపతులు . చివరికి ఏకంగా నాలుగు కోట్ల రూపాయల టోకరా వేసి రాత్రికి రాత్రే పరారయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని BSR కాలనీలో ఈ భారీ మోసం వెలుగు చూసింది.
గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, సాంబశివరావు అనే భార్యాభర్తలు అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికులతో పరిచయాలు పెంచుకుని చిట్టీల వ్యాపారం పేరుతో అందరినీ నమ్మించారు. ఆ తర్వాత తమ ఆస్తులన్నింటినీ అమ్ముకుని, రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు.
మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆగస్టు 2న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్లో చిట్టీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు దంపతులు. నమ్మకంతో చిట్టీలేసిన బాధితులు కోట్ల రూపాయలు కోల్పోవడంతో లబోదిబోమంటున్నారు.