Reading Time: < 1 minute

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారని కిర్‌స్టన్ అన్నారు.పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలలకే.. ఒక్క వన్డేకు కూడా కోచ్ గ వ్యవహరించకుండానే గ్యారీ కిర్‌స్టన్ అక్టోబర్ 2024లో హెడ్ కోచ్ పదవి నుండి వైదొలగాడు. దీనిపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బోర్డులో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్‌కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు.

“జట్టు సరిగ్గా ఆడనప్పుడు, కోచ్‌ను సులభంగా బలిపశువును చేస్తారు. ‘కోచ్‌ను తొలగిద్దాం’ లేదా ‘కోచ్‌పై ఆంక్షలు విధిద్దాం’ అని అంటారు. ఎందుకంటే జట్టు సరిగ్గా ఆడనప్పుడు చేయడానికి అదే సులభమైన పని. కానీ నా దృష్టిలో అది ప్రతికూల ఫలితాలనిస్తుంది. బయటి నుంచి నిరంతరం గొడవ జరుగుతున్నప్పుడు, ఒక కోచ్ వచ్చి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం చాలా కష్టం. అది చాలా కష్టంగా ఉంటుంది. అయినా, ప్రతీ సందర్భంలోనూ నిందలు వేయాలని చూసేటప్పుడు, అసలు కోచ్‌ను ఎందుకు నియమించుకోవాలి?” అని కిర్‌స్టన్ విమర్శించారు. కాగా, ప్రస్తుతం కిర్‌స్టన్, శ్రీలంక జట్టుకు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. ఏప్రిల్ 15న ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.