
హైదరాబాద్: అభయహస్తం అనే దస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారెంటీలపై సంతకం జరిగిందని చెప్పించారని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో అరగ్యారెంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపి పెట్టిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కోరుతూ ప్రైవేటు మెంబరు ప్రవేశపెట్టనున్నామని తెలియజేశారు.
వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామని, తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని, ఆరు గ్యారెంటీలపై సిఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందని కెటిఆర్ పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు..వెంటనే అమలు చేయాలని, పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారు.. వెంటనే పెంచాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారు..అదీ అమలు చేయాలని సూచించారు. తాము పెట్టే బిల్లు పాస్ అయితే.. హామీలన్ని చట్టప్రకారంగా అమలవుతాయని, తాము పెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి ఎమ్మెల్యేపై ఒత్తిడి తేవాలని కెటిఆర్ కోరారు.