
కోల్‌కతా: త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ప్రజల “ఓటు హక్కులను లాక్కోవడానికి” బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. శనివారం కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఈద్ కార్యక్రమంలో సిఎం మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని తీవ్రంగా విమర్శించారు.
“SIR (ఓటర్ల జాబితా)లో ప్రజల పేర్లు తొలగించారు. సర్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వరకు వెళ్లాను. ప్రజల హక్కులు పరిరక్షించబడతాయని నేను ఆశిస్తున్నాను. బెంగాల్‌లోని అన్ని కులాలు, వర్గాలు, మతాలకు చెందిన వారందరికీ నేను అండగా నిలుస్తా. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తా. మోడిజీ మా హక్కులను లాక్కోవడానికి మేం అనుమతించం. మీరు మా ప్రభుత్వాన్ని బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటున్నారు. అయినా సరే, మేము భయపడము. భయపడేవారు అంతమైపోతారు… పోరాడేవారే జీవితంలో విజయం సాధిస్తారు. బీజేపీ అనేది దొంగలు.. గూండాలు.. దేశద్రోహుల పార్టీ. ఓట్లను చీల్చడానికి బీజేపీ నుండి డబ్బు తీసుకునే దేశద్రోహులు కూడా ఉన్నారు” అని ఆమె ధ్వజమెత్తారు.