
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి రూ.330 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఓపెనింగ్ వీకెండ్‌లో రూ.354 కోట్ల వసూళ్లు చేసిన రికార్డు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-2’ సినిమా పేరిట ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డును బద్దలుకొట్టే దిశగా దూసుకెళ్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి తెలుగు, తమిళ వెర్షన్‌లు కూడా రానుండటంతో ఆ రికార్డులు దాటడం ధురంధర్‌కి సులభంగా సాధ్యమవుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,123 షోలను ప్రదర్శిస్తున్నారు. గడిచిన గంటలో బుక్ మై షో వేదికగా 93 వేలకు పైగా టికెట్లు విక్రయమయ్యాయి. అంతేకాదు.. 74.2 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండటం కూడా ఓ రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా రోజుల తర్వాత ‘ధురంధర్-2’తో థియేటర్లు కళకళలాడుతున్నాయని సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.