Reading Time: 2 minutes

ప్రతి పండుగ వెనుకా పరమార్థం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించుకోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం. వీటితోపాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగలు కూడా ఉన్నాయి. వాటిలో రంజాన్ ఒకటి. ముస్లింలకు అతి పెద్ద పండగ ఇది. ఇస్లాం ధర్మానికి మూలమైన ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది. ఈ పండుగ వెనక మానసిక, శారీరక వికాసం వంటి మరెన్నో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. నెలవంక దర్శనంతో మొదలై, మళ్లీ నెలవంక దర్శనంతోనే ముగిస్తుంది. మానవాళి అంతా.. బాగుండాలని కోరుకునే పండగనే రంజాన్. ముస్లింల పవిత్ర పండగైనప్పటికీ అందులో సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఆచరణ కన్పిస్తుంది. పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.

‘పండుగ’ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘రంజాన్’ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్’ మాసం. రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘జకాత్ ’ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్’అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30% చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితోపాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘జకాత్’ ఉపయోగపడుతుంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’.

ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా అని అంటారు. రోజా అనే ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. సుమారు నెలరోజులకు పైగా ఉపవాస దీక్షలు చేయడం వల్ల సమాజంలో ఆకలి విలువను తెలుసుకోవడాని రోజాను పాటిస్తారు. అలాగే రంజాన్ నెల మాసంలో కుల, మత భేదాలు లేకుండా ఇఫ్తార్ విందులు. ఈ విందులు పరస్పర ఆత్మీయతకు దోహదపడేలా.. విశాల ఆలోచన దృక్పథానికి నిదర్శణం నిలుస్తుంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా’ అని అంటారు. సౌమ్ అని పిలుస్తారు. రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే ‘షవ్వాల్’ నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాస వ్రతాన్ని విరమించి మరుసటి రోజు ‘రంజాన్ ’ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు.

‘షవ్వాల్’ నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ‘ఈదుల్‌ఫితర్’ అని అంటారు. మానవహితాన్ని, పరస్పర సోదర భావాన్ని, ఎదుటి వారి బాధలను అర్థం చేసుకొని వారికి అండగా ఉండేలా మానవ సమాజహితాన్ని ఆకాంక్షిస్తుంది. అలాగే ఈ ఇఫ్తార్ విందుతో అంటరానితనం దూరం చేసే ఆలోచన.. అందరూ సమానమనే భావన ముడిపడి ఉంది. అందుకు మనం జాతీయ ఉద్యమ నాయకుడు మౌలానా హస్రత్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విప్లవం వర్ధిల్లాలి, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలు భారత జాతియోద్యమ చరిత్రను మహత్తర మలుపు తిప్పినట్టు అందరికీ తెలుసు. వీటిని రూపొందించిన సుప్రసిద్ధ ఉర్దూ కవి, జాతియోద్యమ నాయకుడు మౌలానా హస్రత్ మోహానీ గురించి మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలిసివుండకపోవచ్చు. దళిత్- ముస్లిం ఇఫ్తార్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఆయనే. అంబేడ్కర్ చేతితోఇచ్చిన నీళ్లను ముట్టుకోవడానికి కూడా జాతీయోద్యమ మహానాయకులు సైతం వెనుకాడుతున్న కాలం అది. అప్పుడు మౌలానా హస్రత్ మోహానీ ఇఫ్తార్ విందుకు అంబేద్కర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఒకే పళ్లెంలో ఆయనతో కలిసి భోజనం ఆరగించారు. అటువంటి సమానత్వాన్ని, ఆకలి బాధలు, దాతృత్వాన్ని చాటి చెప్పే గొప్ప పండగ రంజాన్.. హస్రత్ మెహనీ చూపిన మార్గం.. ఆ సాంప్రదాయం భవిష్యత్తులో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– సంపత్ గడ్డం, 78933 03516