Reading Time: 4 minutes

అంతర్జాతీయ చర్చలలో కొద్ది రోజులుగా ఆందోళనకరమైన మాట ఒకటి వినవస్తున్నది. ఇరాన్‌పై మూడు వారాల యుద్ధంలో ఏ ఒక్క లక్షాన్నీ సాధించలేకపోయిన ఇజ్రాయెల్, రాగల వారాలలో కూడా అందుకు అవకాశాలు కనిపించని స్థితిలో చివరకు అణ్వస్త్ర ప్రయోగం ‘చేసినా చేయవచ్చు’నని. ఈ మాటలు మొదటి 12 రోజుల యుద్ధం జరిగినాక నెమ్మదిగా మొదలై, క్రమంగా పెరుగుతున్నాయి. మామూలుగానైతే ఇంత తీవ్రమైన ఉహాగానాలకు విలువ ఉండకూడదు. కాని, ఆ పని ‘జరిగినా జరవచ్చు’నని అనుమానించే నిపుణుల సంఖ్య పెరుగుతుండటానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ- స్వభావం. పాలస్తీనాపట్ల, మొత్తం పశ్చిమాసియాపట్ల, ఇరాన్‌పట్ల ఇజ్రాయెల్ మౌలిక విధానాలు మొదటినుంచి తెలిసినవే. కాని నెతన్యాహూ విధానాలే గాక, వ్యక్తిగత స్వభావం అతి ప్రమాదకరమైనది. అందుకు ప్రత్యక్ష సాక్షంగా గాజా మారణకాండ ప్రపంచం కళ్లముందు నిలుస్తున్నది. నెతన్యాహూ ఎందుకైనా తెగించవచ్చుననే భయం మెల్లమెల్లగా మొదలవుతున్నది అందువల్లనే.

వాస్తవానికి ఇరాన్‌పై ప్రస్తుత యుద్ధ నిర్ణయంగాని, ఇంకా చెప్పాలంటే నిరుడు జూన్‌లో జరిపిన దాడులుగాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనంతటతాను చొరవ చేసి తీసుకున్నవి కావన్నది ప్రపంచానికి ఈసరికి స్పష్టమైంది. ట్రంప్ అంతిమ లక్షాలు ఏవైనా ఆయన చేస్తుందినది మాత్రం మధ్యవర్తి దేశాల ద్వారా ఇరాన్‌తో చర్చలు. ఇరాన్ నిరుడు జూన్ సమయంలోగాని, ఇపుడు గాని కొన్ని ముఖ్యమైన రాజీలకు సిద్ధపడిందన్నది కూడా తెలిసిన విషయమే. కాని ఎపుడు కూడా రాజీ ఇష్టం లేనిది నెతన్యాహూకు మాత్రమే. అమెరికా లక్షాలు వేరు, తన లక్షాలు వేరు. కనుక, చర్చలకు, రాజీలకు గతంలోవలెనే ఈసారి కూడా భంగం కలిగించబూనారు. ఆయన లక్షాలు ఒకవేళ ఏదో రూపంలో పాలస్తీనా ఏర్పాటుకు అమెరికా అంగీకరించినా అది ఎట్టి పరిస్థితులలో నెరవేర నివ్వకపోవటం; గాజా, వెస్ట్ బ్యాంక్‌లతోపాటు సిరియా, జోర్డాన్, లెబనాన్‌లలోని భూభాగాలు ఆక్రమించి గ్రేటర్ ఇజ్రాయెల్ ఆవిష్కారం; ఇరాన్‌ను భిన్నాభిన్నం చేసి అరాచకంగా మార్చి, అక్కడ తమ అనుకూలురు అధికారానికి వచ్చేట్లు చూడటం.

పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలకు ఇజ్రాయెల్ అతి కీలకమన్నది అక్కడి అధ్యక్షులు మొదటి నుంచి స్వయంగా చెప్పేమాట. గత సంవత్సరం చివరిలో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’ లోనూ ఆ విషయం తిరిగి ప్రకటించారు. కాని రెండు విషయాలు గుర్తించాలి. పశ్చిమాసియాలో గాని, ఇరాన్ విషయమై గాని అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్షాలు పూర్తిగా ఒకటి కావు. అమెరికాకు కావలసింది ఆధిపత్యం, చమురు. ఇజ్రాయెల్ కోరుకునేది ఏమిటో పైన చూసాము. పోతే, తమతమ లక్షాల సాధనకు ఇరువురు అనుసరించే విధానాలు, పద్ధతులలో కొన్ని పోలికలు, కొన్ని తేడాలు ఉన్నాయి. అది కూడా పైన చూసాము. అమెరికా పని దౌత్యమార్గంలో వత్తిడులు, ఆర్థికంగా దెబ్బతీయటం, సైనికంగా బెదిరించటం, చివరకు సామంత రాజ్యంగా మార్చుకోవటం. ఇజ్రాయెల్‌కు ఇవి అక్కరలేదు. ఈ పద్ధతులతోనూ పని లేదు. వారి ఏకైక లక్షం, పద్ధతులూ పైన చెప్పుకున్నవి మాత్రమే.

అందుకు తమ శక్తి చాలదు గనుక అమెరికాను, వీలైనంతవరకు యూరోపియన్ దేశాలను తోడు చేసుకోవాలి. అందుకు యథాతథంగా వారి విధానాలు కూడా సానుకూలమన్నది అట్లుంచి, దానికి అదనంగా ఇరాన్ అణ్వస్త్రాలంటూ, టెర్రిరిజం అంటూ, మరొకటి అంటూ నిజాలూ, అబద్ధాలు ప్రచారం చేయటం, అమెరికా, యూరప్‌లలోని బలమైన యూదు లాబీల ద్వారా ప్రభావితం చేయటం వంటివి సాగించాలి. ఇదంతా వాస్తవంగా జరుగుతూ వస్తున్నదే తప్ప ఊహాగానం ఎంత మాత్రం కాదు. అంతెందుకు నిరుడు జూన్‌లో గాని, ఇపుడు గాని దాడులకోసం ట్రంప్‌ను ముగ్గులోకి దింపింది నెతన్యాహూయేనని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో తదితర ఉన్నతస్థాయి అధికారులే స్వయంగా వెల్లడించారు. అందువల్లనే అమెరికా, ఇరాన్ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వం ద్వారా దాదాపు చివరకు వచ్చిన దశలో ఇజ్రాయెల్ పన్నుగడల కారణంగా భంగపడి యుద్ధం మొదలైంది. యుద్ధం ఆరంభించింది ఇజ్రాయెల్ అని, అందుకు ఇరాన్ ఎదురుదాడులు పశ్చిమాసియాలోని తమ స్థావరాలపై కూడా జరగగలవని భావించి, ఆ ప్రకారం ఇరాన్ కూడా హెచ్చరించినందున, తాము యుద్ధంలోకి రావలసివచ్చిందన్నది కూడా రూబియో చెప్పిన మాటే.

దీనంతటిలోని తెరవెనుక విషయాలేమిటో మునుముందు వెల్లడి కావచ్చుగాని ప్రస్తుతానికి కనిపిస్తున్న చిత్రం ఇది. ఇవన్నీ ఇట్లుంచి అణ్వస్త్ర ప్రయోగం విషయానికి వద్దాము. ఇరాన్‌ను వెనిజులా వలెనే భయపెట్టి లొంగ దీసేందుకు వారాల తరబడి భారీ ఎత్తున సైనిక సన్నాహాలు చేసినప్పటికీ ఇరాన్ ధిక్కరించి నిలవటం అమెరికా, ఇజ్రాయెల్‌లకు కొరుకుడు పడనిది అయింది. అయితే కొన్ని కథనాలు సూచిస్తున్న ప్రకారం, చర్చలలో తమను మరిన్ని షరతులకు అంగీకరింపజేసేందుకు సైనిక సన్నాహాల వత్తిడి (వెనిజులా సందర్భంలోవలె) జరుగుతున్నది తప్ప నిజంగా దాడులు జరగకపోవచ్చునని ఇరాన్ నాయకత్వం భావించిందేమో తెలియదు. ఆ వివరాలు ఎట్లున్నా, చివరకు ఫిబ్రవరి 28న ఆకస్మికంగా మొదట ఇజ్రాయెల్, ఆ వెంటనే అమెరికా దాడులు ప్రారంభించాయి. తమ యుద్ధ లక్షాలపై ట్రంప్ ఒక వీడియో విడుదల చేసారు. తొలి దాడులలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ఇరాన్ అంతలోనే తేరుకుని ఎదురు యుద్ధం ప్రారంభించింది.

ఇవన్నీ తెలిసిన పరిణామాలే కాగా, అమెరికా ఇజ్రాయెల్‌లు రెండు రోజులలో తేలిపోతుందనుకున్న యుద్ధం నేడు 21వ తేదీతో మూడవవారం గడిచినా ఇరాన్ భీకర ప్రతిఘటనతో ఎటూ తేలకపోతుండటం ట్రంప్ కన్న ఎక్కువ నెతన్యాహూను ఆందోళనకు గురి చేస్తున్నదనేది పలువురు నిపుణుల అభిప్రాయం. పరిస్థితి అర్థమవుతుండటంతో అమెరికా అధ్యక్షుడు యుద్ధం నడిచేది 34 వారాలని, 6 వారాలని, ఎప్పటికి ముగిసేది చెప్పలేమని రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రకటించిన లక్షాలలో ఇంతవరకు ఒక్కటైనా సాధించలేదు. ఇపుడు కుర్దులను తిరగబడమంటున్నారు, మెరైన్ సైన్యాన్ని పంపే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇరాన్ దేనికీ భయపడకపోవటం, లొంగే ప్రసక్తి లేదనటం ఒకటి కాగా, అమెరికా, ఇజ్రాయెల్‌లు మొదటి ఊహించని స్థాయిలో సాగిస్తున్న ఎదురు దాడులూ, గల్ఫ్ దేశాలతో పాటు వీరిద్దరికీ కలిగిస్తున్న తీవ్రమైన నష్టాలు ప్రధానంగా నెతన్యాహూ ఆందోళనను పెంచుతున్నట్లు కనిపిస్తున్నది.

స్వయంగా పాశ్చాత్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇజ్రాయెల్ సెన్సారింగ్ కారణంగా వివరాలు బయటకు రావటం లేదు గాని, ఇరాన్ దాడులతో అక్కడ విధ్వంసం, ప్రాణనష్టం భారీగానే జరుగుతున్నది. ఇరాన్ క్షిపణి దాడులను, డ్రోన్లను ఎదుర్కొనే ఐరన్ డ్రోన్ మిసైళ్లు విఫలమవుతున్నాయి. వాటి సంఖ్య కూడా తగ్గుతుండగా వాటిని అమెరికా గల్ఫ్ నుంచి, దక్షిణ కొరియా నుంచి అటు తరలిస్తున్నది. ఇరాన్ వద్ద గల క్షిపణులు, డ్రోన్లు ఎన్ని వేలో అంచనా రావటం లేదు. ఇంత వరకు ప్రయోగించిన వాటికి మించినవి వారు ఇంకా బయటకే తీయలేదన్నది అంచనా. ఇప్పటికే జరిగిన నష్టాలు, దరీతెన్నూ లేని పరిస్థితితో ఇజ్రాయెల్, అమెరికాలలో వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. ఇదంతా దిక్కుతోచని స్థితిని సృష్టిస్తుండటంతో ఇరాన్ ఇపుడు కాకుంటే మరెపుడూ ఓడదన్న భయంతో నెతన్యాహూ వంటి లక్షణాలు గల వ్యక్తి ఆ లక్షణాలు మరింత ప్రకోపించి అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చునా అన్నది ప్రశ్న. లేక అది ముందే పసికట్టి రష్యా, చైనాలు తీవ్ర హెచ్చరికలతో ఆ ప్రళయాన్ని నిరోధించవచ్చునా? చివరగా ఒకటి మాత్రం అనిపిస్తున్నది. అమెరికా, సోవియెట్ యూనియన్ రెండూ 1940 ల నుంచి అణ్వస్త్రాలు తయారు చేయటంవల్ల ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనేది ఏర్పడి ప్రపంచం శాంతియుతంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ వలెనే ఇరాన్ కూడా అస్త్రాలు ఉత్పత్తి చేస్తే తప్ప పశ్చిమాసియాలో ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ శాంతి సిద్ధించదేమో.

ఇటువంటి చర్చవచ్చినపుడల్లా ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్ర బలాన్ని నిపుణులు ఉదహరిస్తున్నారు. ఇరాన్‌తో పోల్చితే అతి చిన్నది అయిన ఉత్తర కొరియా 2006 లో అణ్వస్త్ర శక్తిగా మారింది. ఇపుడు వారి వద్ద 50 పైగా అస్త్రాలు ఉన్నట్లు అంచనా. ఎపుడైనా అస్త్రాల తయారీ ఎంత ముఖ్యమో వాటిని సుదూర ప్రాంతాలకు మోసుకుపోగల క్షిపణులు కూడా అంతే ముఖ్యం. ఉత్తర కొరియా తమకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో గల అమెరికా కూటమి దేశాలు దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్, ధాయ్‌లాండ్‌లపై ప్రయోగించి ధ్వంసం చేయగల క్షిపణులను ఎప్పుడో రూపొందించింది. సుమారు 6,400 మైళ్లకు దూరాన గల అమెరికా పశ్చిమ తీరాన్ని సైతం తాక గల క్షిపణులను కూడా సిద్ధం చేసినట్లు కొద్ది కాలం క్రితం ప్రకటించి తీవ్ర కలకలాన్ని రేపింది. వారు అణ్వస్త్రాలను, ఆ స్థాయి క్షిపణులను ఉత్పత్తి చేయటం సరైనదా కాదా, అణు యుద్ధం నిజంగా చేస్తారా లేదా అన్నది కాదు ప్రశ్న. అంతటి చిన్న దేశంపై దాడికి అమెరికా సాహసించలేకపోవటం, అణ్వాయుధాల కారణంగా అమెరికాకు అటువంటి భయాన్ని సృష్టించి ఆత్మరక్షణ చేసుకోగలగటమన్నవి గమనించదగ్గ విషయాలు.

చాలా మంది మరిచిపోయి ఉంటారు గాని, 195053 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో అక్కడి కమ్యూనిస్టు సేనలను ఓడించలేకపోవటంతో అణ్వస్త్ర ప్రయోగం ఆలోచనలు అమెరికా చేసింది. తర్వాత వియత్నాం యుద్ధం (195575), అప్ఘాన్ యుద్ధ (2020) సమయాల్లోనూ ఆ మంతనాలు సాగాయి. ప్రస్తుతానికి వస్తే, గత జనవరిలో వెనిజులాలో, ఇపుడు ఇరాన్‌పై కనిపించే చర్యలు, రేపు క్యూబాపై చేయగలమంటున్నవీ ఆయా దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండినట్లయితే జరిగేవేనా? అమెరికా, ఇజ్రాయెల్ రెండింటి వద్దా అవి ఉండగా, ఇరాన్ వద్ద లేవు గనుకనే ఇటువంటి దాడి అవకాశాలు చర్చకు వస్తున్నాయి. ఇరాన్ అణ్వస్ర్త వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఎన్నడో సంతకం చేయటమే గాక, ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటిస్తున్నది. ఆ విధంగా ఇరాన్ తన చేతులు తాను కట్టి వేసుకోవటాన్ని అనువుగా చేసుకున్న ఇజ్రాయెల్ ఏ విధంగా వ్యవహరిస్తున్నదో ప్రపంచమంతా చూస్తున్నది. పై చెప్పుకున్నట్లు, ఇరాన్‌ను మూడు వారాలు గడిచినా అమెరికాతో కలిసి కూడా ఓడించలేకపోవటమే గాక, ఇరాన్ ఎదురు దాడులతో భారీ నష్టాలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, ఎంత మాత్రం స్వీయ నియంత్రణ లేని స్వభావం కారణంగా తమ లక్షాల సాధన కోసం ఏదో ఒక రోజు పిచ్చెక్కినట్లుగా మారి అణు ఆయుధాల ప్రయోగం చేయవచ్చునా అనేది సందేహం. 

– టంకశాల అశోక్ ( దూరదృష్టి)

– రచయిత సీనియర్ సంపాదకులు