Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 10 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువైన ఆరోగ్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్లను ఆకర్షించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ హామీలను విడుదల చేస్తూ, రాబోయే ఐదేళ్ల పాలనకు ఇవే మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని టీఎంసీ నిర్ణయించింది. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే.. ప్రతి నెలా మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. 500 పెంచనున్నట్లు ప్రకటించింది. అంటే జనరల్ కేటగిరీ మహిళలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు రూ.1,700 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 1500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజల ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించే ‘డువారే చికిత్స’ పథకం మేనిఫెస్టోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సులభంగా ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రం లోని వేలాది పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఈలెర్నింగ్ సదుపాయాలను కల్పిస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా అందేలా చూస్తామని ప్రకటించింది. రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలని, ప్రతి ఇల్లూ సంతోషం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ 10 హామీలు బెంగాల్ ప్రజల భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.