
హోర్ముజ్ జలసంధి సమీపాన చమురు రవాణా వాణిజ్యనౌకలో మృతి చెందిన కెప్టెన్ రాకేష్ రంజన్ మృతదేహాన్ని తిరిగి తీసుకు రావడంలో సహకరించాల్సిందిగా ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాంచీకి చెందిన రంజన్ (43) ప్రైవేట్ కంపెనీకి చెందిన వాణిజ్యనౌక ‘ఎఎస్‌పి అవనాఆర్‌పిఎస్‌ఎల్ ఎంయుఎం172’ లో ఫిబ్రవరి 2న చేరారు. గుండెపోటుతో మార్చి 18న చనిపోయినట్టు ఆయన కుటుంబం వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధికి 14 నాటికల్ మైళ్ల దూరంలో ఫిబ్రవరి 28 నుంచి ఈ నౌక నిల్చిపోయింది. “ వీలైనంత త్వరగా తన సోదరుని మృతదేహాన్ని రప్పించేందుకు సహకరించాలని జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌ను అభ్యర్థించాను. తన సోదరునికి రావలసిన ఆర్థిక బకాయిలు చెల్లింపులో కంపెనీ నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా
ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలి” అని ఆయన పెద్దన్న ఉమేష్ సింగ్ చెప్పారు. “ కేంద్ర ప్రభుత్వాన్ని , దుబాయ్ లోని భారత దౌత్యకార్యాలయాన్ని, కంపెనీని తన సోదరుని మృతదేహాన్ని వేగంగా రప్పించాలని విజ్ఞప్తి చేశాను ” అని ఉమేష్ సింగ్ చెప్పారు. ఈమేరకు సిఎం సోరేన్‌కు, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్‌కు లేఖలు రాశానని తెలిపారు. “ నౌకలోకెప్టెన్ విధుల్లో ఉన్న తన సోదరుడు అపస్మారక స్థితిలో తన కుర్చీ నుంచి పడిపోయినట్టు మార్చి 18న కంపెనీ తెలిపింది. వైద్యసాయం అందించడానికి ప్రయత్నాలు జరిగాయి. విమానంలో ఆయనను తరలించడానికి అనుమతించలేదు. ఆ తరువాత ఆయన బోటులో దుబాయ్ లోని రషీద్ పోర్టుకు తరలించారు. అక్కడ ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ” సింగ్ చెప్పారు. కెప్టెన్ రంజన్ పోస్ట్‌మార్టమ్ నివేదిక కోసం కుటుంబం నిరీక్షిస్తోంది. రషీద్ పోర్టులో పోలీస్ కస్టడీలో మార్చురీలో రంజన్ మృతదేహం భద్రపర్చి ఉంచారు.