Reading Time: < 1 minute

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్‌తో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల ను, ఆర్‌టిసి కార్మికుల సమస్యలను, నిరుద్యోగల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పించన్ పెంపు హామీలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంకెలగారడీ, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి పేదలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమయ్యిందని హరీష్ రావు అన్నారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చి మూడేళ్లు కాలేకపోయినా మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు భట్టి ఘోరీ కట్టారని, కాగితాల మీద అంకెలు తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు , ఈసారి కూడా 6 వేల కోట్లు అన్నారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగిందని, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు.