Reading Time: 2 minutes

గల్ఫ్‌లో చమురు కేంద్రాలపై దాడులు ఉధృతం అయ్యాయి. తమ ప్రతీకార దాడుల్లో ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్‌లోని ఇంధన వ్యవస్థలను దెబ్బతీయడం అంతర్జాతీయంగా చమురు సంక్షోమ తీవ్రతకు దారితీసన దశలోనే కువైట్‌లోని రిఫైనరీకి భారీ నష్టం సంభవించింది.ప్రతిరోజూ 7,30,00 బ్యారెల్స్ శుద్ధి సామర్థం గల ఈ రిఫైనరీ వరుసగా రెండో రోజు కూడా దాడులకు గురైంది. చమురు సంపన్న గల్ఫ్ దేశం కువైట్‌లో ఉన్న మూడు రిఫైనరీలలో మినా రిఫైనరీ ఒకటి. పర్షియన్ గల్ఫ్‌లోని తమ భారీ సహజవాయువు ఉత్పత్తి సౌత్ పార్స్ కేంద్రంపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్‌లోని పలు చమురు క్షేత్రాలపై దాడులకు దిగుతోంది. ఇంతకు ముందే దెబ్బతిని ఉన్న కువైట్ రిఫైనరీ ఇప్పటి దాడులతో మరింత ధ్వంసం అయింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ దాడుల క్రమంలోనే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబీ నుంచి అరుదైన ప్రకటన వెలువడింది.ఇక ఇరాన్ శత్రువులు తమ భద్రతను గాలికి వదిలిపెట్టాల్సిందే అని ఆయన తరఫున ప్రకటనను వార్తా సంస్థలు వెలువరించాయి.

మరో వైపు ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే టెహరాన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ క్షిపణుల దాడులలో పలు ప్రాంతాలో మంటలు చెలరేగాయి. పర్షియన్ న్యూ ఇయర్ దశలోనే ఈ దాడులు ముమ్మరం అయ్యాయి. ఇరాన్ దాడులకు దెబ్బతింటున్న దుబాయ్‌లో శుక్రవారం కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. స్థానికంగా ఈదుల్ ఫితర్‌కు ప్రజలు సిద్ధమైన దశలోనే క్షిపణులు, డ్రోన్ల దాడుల భయాలు నెలకొన్నాయి. బహరైన్‌లో ఓ ఆయుధగిడ్డంగిపై దాడి జరిగింది. సైదీ అరేబియాలోని చమురు సంపన్న తూర్పు ప్రాంతంలో పలు డ్రోన్లను భద్రతా దళాలు నేలకూల్చాయి. ఇరాన్‌కు చెందిన గ్యాస్ ఫీల్డ్‌లపై మరోసారి దాడులకు దిగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. చమురు సంక్షోభ తీవ్రత దశలో ట్రంప్ చేసిన విజ్ఞప్తి మేరకు తాము స్పందించినట్లు వివరించారు. ఇప్పటికే ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీశామని తెలిపారు. ఈ వాదనను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో సిరియాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు దెబ్బతిన్నాయి. డ్రూజే ప్రాంతంలో ఇంతకు ముందు జరిగిన దాడులకు ప్రతిగా సిరియాలోని స్థావరాలను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ స్పందించింది.