Reading Time: < 1 minute

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్‌జూయే మరోసారి వార్తల్లో నిలిచారు. సైనిక విన్యాసాల్లో ఆమె ట్యాంకర్ నడిపిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సియోల్ నుంచి వచ్చిన సమాచార ప్రకారం, తండ్రి పర్యవేక్షణలో జరిగిన సైనిక శిక్షణలో కిమ్‌జూయే ట్యాంకర్‌ను నడిపిన దృశ్యాలు బయటకు రావడంతో, ఆమెను భవిష్యత్ వారసురాలిగా తయారు చేస్తున్నారనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ సైనిక ట్యాంకర్ దళాలు, సైనికులతో కూడిన వ్యూహాత్మక విన్యాసాలను పర్యవేక్షించి, యుద్ధ సన్నద్ధతను పూర్తి చేయాలని సైన్యానికి పిలుపునిచ్చారు. విడుదలైన వీడియోలు, చిత్రాల్లో ఆయన కుమార్తె ఒక ఆకుపచ్చ రంగు ట్యాంకర్ డ్రైవర్ హ్యాచ్ నుంచి బయటికి చూసుకుంటూ వాహనాన్ని నడుపుతుండగా, కిమ్ పైభాగంలో కూర్చొని చిరునవ్వుతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

సుమారు 13 సంవత్సరాల వయస్సు గల కిమ్ జూయే, 2022 చివరి నుండి తండ్రితో కలిసి పలువురు కీలక సైనిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఉత్తర కొరియా మీడియా ఆమెను అత్యంత ప్రియమైన, గౌరవనీయమైన సంతానంగా పేర్కొంటూ, ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించే దృశ్యాలను తరచుగా ప్రసారం చేస్తోంది. ఇటీవల ఒక ఆయుధ తయారీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు తండ్రితో కలిసి తుపాకీ కాల్పులు జరపడం, రాకెట్ ప్రయోగాల పరీక్షలను వీక్షించడం వంటి కార్యకలాపాల్లో కూడా ఆమె పాల్గొంది. గత సెప్టెంబర్‌లో బీజింగ్ పర్యటనలో తండ్రిని అనుసరించిన ఈ యువతి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయనకు చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ఇటీవల ఆమెను వారసురాలిగా ప్రకటించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారని అంచనా వేసింది. అయితే కిమ్ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.