
టీం ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బిసిసిఐపై సంచలన ఆరోపణలు చేశారు. బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. సోషల్‌మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. 23 ఏళ్లుగా తనని నిర్లక్ష్యం చేసిందని బిసిసిఐపై మండిపడ్డారు. బ్రాడ్‌కాస్టింగ్‌తో సుదీర్ఘ సంబంధాలు ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా తనకు కీలక బాధ్యతలు అప్పగించలేదని అన్నారు.
‘‘నేను బిసిసిఐ కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నా. గత 23 ఏళ్లుగా నన్ను పెద్ద మ్యాచ్‌లకు టాస్ వేయడం.. అవార్డు ప్రజెంటేషన్ వంటి వాటికి వినియోగించలేదు. నా తర్వాత వచ్చిన వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడూ కొత్త వాళ్లతోనే పిచ్ రిపోర్ట్ ప్రజెంటేషన్ చేయించింది. నన్ను పక్కనపెట్టి అలా చేయడానికి కారణాలు ఏంటో తెలియరాలేదు. అయితే ఆత్మ గౌరవాన్ని త్యాగం చేసి ఎవరికీ దాసోహం కాలేను. అలా ఎప్పటికీ ఉండలేను. ఈ నిర్ణయం ఒక కథకు ఆరంభం మాత్రమే. సాధారణ ప్రజలు, క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరూ షాక్ అవుతారని తెలుసు. అలాగే నన్ను ద్వేషించేవాళ్లు సంతోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కనీసం నేను మంచి వాడినని భావించిన వారికి ధన్యవాదాలు’’ అంటూ వరుస పోస్టులతో శివ రామకృష్ణన్ విమర్శించారు. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘వద్దు’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.