
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.33,688 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.2,622 కోట్లు, చేయూత పెన్షన్లకు రూ.14,861 కోట్లు, పంచాయతీ రాజ్ హామ్ రోడ్లకు రూ.1372 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.750 కోట్లు, గ్రామీణ రహదారుల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించిన నిధుల కేటాయింపును వివరించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక
చేసిన రహదారులను హామ్ విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కి.మీ. గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధానం ప్రకారం 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60 శాతాన్ని రాయితీదారు పెట్టుబడి పెడతారని స్పష్టం చేశారు. ఈ 60 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీలలో తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్వహణబాధ్యత పెట్టబడిదారుడికే ఉంటుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,980 కి.మీ.ల రహదారులను నిర్మించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.