Reading Time: < 1 minute

 వార్షిక బడ్జెట్ లో మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లను కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘ఆధార్‌శిల’ పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకు అత్యుత్తమ ప్రీ-ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నామని చెప్పారు. ‘బాల భరోసా’ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా, వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి, భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకు కొండంత ’భరోసా’ను ఇస్తోందని భట్టి పేర్కొన్నారు.

దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ, తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం కానుకగా అందిస్తోందని చెప్పారు. ‘స్టేట్ న్యూట్రిషన్ మిషన్’ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 ‘మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను’ ఏర్పాటు చేయబోతున్నామని భట్టి తెలిపారు. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్‌వాడీ కమ్ క్రచ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతోపాటు, డే- కేర్సే సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంక్షేమానికి 37 ‘ప్రణామ్’ డేకేర్ సెంటర్లు మంజూరు చేశామని వెల్లడించారు.