Reading Time: < 1 minute

విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత భవిష్యత్తు దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్ధిక వృద్ది, భవిష్యత్ రాష్ట్ర పునాదిగా భావిస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు.ఈ బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ. 21,285 కోట్లు కేటాయించారు. గతేడాది విద్యుత్ రంగానికి రూ. 21,221 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ. 64 కోట్లు స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవడానికి నిరంతర సరఫరా మాత్రమే కాదని, విశ్వసనీయత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23,187 మెగా వాట్ల సామర్ధం ఉందని వీటిలో అధిక భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోందని చెప్పారు. విద్యుత్ కొరతల నుంచి మాట్లాడుకునే దగ్గర నుంచి నేడు విద్యుత్ భవిష్యత్‌ను రూపొందించే దిశగా రాష్ట్రంగా మారిందని భట్టి తెలిపారు.

ఈ బడ్జెట్‌లో విద్యుత్ రాయితీలకు రూ. 14వేల కోట్లు, గృహా జ్యోతికి రూ. 2,080 కోట్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో, గ్రీన్ ఎనర్జీ, వందశాతం సౌర గ్రామాల ఏర్పాటుకు వెయ్యికోట్ల చొప్పున కేటాయించారు. హైదరాబాద్‌లో భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చుతున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,036 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణహిత రవాణా దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా ఈ బడ్జెట్‌లో సహకారం అందించినట్లు భట్టి పేర్కొన్నారు. గృహా జ్యోతి పథకం ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలు లబ్దిపొందుతున్నాయని వాటిని కొనసాగించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామన్నారు.