
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1,500 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేసే దిశగా కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో మూసీనది ప్రక్షాళన, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టిపిల) ఏర్పాటు, నది పొడవునా పచ్చదనం పెంచే పనులకు వినియోగించనున్నారు. సుమారు 55 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రివర్ వాక్-వేలు, సైక్లింగ్ ట్రాక్‌లు, పర్యాటకుల కోసం ప్రత్యేక వినోద ప్రాంతాలను ఏర్పాటు చేయనుంది. మరోవైపు నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మూసీ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఈ ప్రాజెక్టును కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సామాజిక -ఆర్థిక సర్వేలు పూర్తి చేసింది. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే పనులు వేగంగా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రాజెక్టు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు, భూసేకరణకు సంబంధించి అత్యవసర పనులకు ప్రభుత్వం ఉపయోగించనుంది.