
తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ‘కుంభమేళా’ తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అందుకు అనుగుణంగా 2026-.27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.500 కోట్లను ప్రత్యేకంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం కేటాయించింది. డిప్యూటీ సిఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరిగే గోదావరి పుష్కరాలు రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. సుమారు 8 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కాగా పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు తెలంగాణలో ఆధ్యాత్మికంగా పర్యాట రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు. దేవాదాయ శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో తొమ్మిది కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించిందని తెలిపారు. ఈ సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.