Reading Time: < 1 minute

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఫూచరిస్టిక్ బడ్జెట్ అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశామని అన్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా కుటుంబ జీవిత బీమా ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. విద్యారంగ సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విద్యా విధానం మార్పు చేస్తామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు ఒకే చోట చదివేలా విద్యా విధానం రూపొందిస్తామని అన్నారు.

ఇక మూసీ పునరుజ్జీవం విషయంలో రాజీ పడేది లేదని సిఎం స్పష్టం చేశారు. మూసీ బాధితులను ఆదుకుంటామని.. మూసీ అభివృద్ధికి అప్పులు ఇచ్చేందుకు ఎడిబి సిద్ధంగా ఉందని తెలిపారు. మూసీ డిపిఆర్ సాంకేతిక నిపుణుల ద్వారానే తయారవుతోందని అన్నారు. డిపిఆర్ పూర్తయ్యాక నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు స్పష్టం చేశారు. భూములు అమ్మిన నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలని అన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాలేదు.. కానీ, రూ.44 వేల కోట్ల అప్పు చెల్లించామని సిఎం అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకొని గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. హరీశ్, కెటిఆర్, కెసిఆర్‌కు ఎం చెప్పినా.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అని మండిపడ్డారు.