Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌పై గట్టిగానే పడుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎల్‌పిజి సిలిండర్ల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. అయితే అవి సాధారణ పెట్రోల్‌వి కాదు.. ప్రీమియం పెట్రోల్ ధరలు. ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచుతున్నట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ప్రకటించింది. లీటర్‌కు రూ.2.35గా ప్రీమియం పెట్రోల్ ధర పెరిగింది. అయితే సాధారణ పెట్రోల్ ధరలు యథాతధంగా ఉండనున్నాయి. అలాగే బిపిసిఎల్ స్పీడ్, ఐవొసిఎల్ ఎక్స్‌పి95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి.

మన దేశంలో మూడు రకాలుగా పెట్రోల్ లభిస్తోంది. ఒకటి సాధారణ పెట్రోల్, మరొకటి ప్రీమియం, ఇంకోటి హై ఆక్టేన్ ప్రీమియం. మెరుగైన ఇంజిన్ పని తీరు, మైలేజ్ కోసం ఈ ప్రీమియం పెట్రోల్‌ని ఉపయోగిస్తారు. ప్రస్తుత ధరల పెంపు హై ఆక్టేన్, ప్రీమియం పెట్రోల్ ఉపయోగించే వారిపై ప్రభావం చూపుతుంది. బిపిసిఎల్ స్పీడ్, హెచ్‌పిసిఎల్ పవర్, ఐఒసిఎల్ ఎక్స్‌పి95 పేర్లతో ఈ ప్రీమియం పెట్రోల్‌ను విక్రయిస్తాయి.