Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కోత పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1 శాతం ఉండేదని, కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 10.2 శాతం ఉందని విమర్శించారు. వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తారేమో అని చూశామని తెలియజేశారు. బిఆర్ఎస్ హయాంలో జిఎస్ డిపి వృద్ధి 12.50 శాతం ఉండేదని, కాంగ్రెస్ హయాంలో జిఎస్ డిపి వృద్ధి 10.07 శాతానికి తగ్గిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, జిఎస్ డిపి తగ్గిందని, కాంగ్రెస్ ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు మూడు ముక్కలాట తప్ప..ప్రజలపై ప్రేమ లేదని, బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైందని అన్నారు.

పారిశ్రామికవేత్తలపై తుపాకులు పెట్టి.. వసూళ్లకు పాల్పడితే పెట్టుబడులు వస్తాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇండస్ట్రియల్ హబ్.. కరెప్షన్ హబ్ గా మారిందని, ఆరు గ్యారెంటీలు అమలు చేశామని సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రభుత్వం భారతదేశంలో ఏదీ లేదని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి.. నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిసికి రూ.2500 కోట్లు బకాయిలు పెట్టారని, ఉచిత బస్సు వల్ల ఆర్టిసికి లాభాల్లోకి వెళ్లిందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టిసి లాభాల్లో ఉంటే.. గత రెండేళ్లలో అప్పులు ఎందుకు చేశారు? అని నిలదీశారు. హైదరాబాద్ లోని బస్టాండ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.