
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టప్రకారం వెళ్తేనే.. రేపు కోర్టులో కేసు నిలుస్తోందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 20 నెలలు అందుబాటులో లేరని.. అందుకే 20 నెలలు ఆలస్యమైందని తెలిపారు. ప్రభాకర్‌రావు అందుబాటులోకి వచ్చాక విచారణ కొనసాగుతోందని అన్నారు. సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణకే రాలేదని స్పష్టం చేశారు. చక్రధర్‌గౌడ్ కేసు కొట్టేస్తే.. ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు.
జాతీయ జిడిపి కంటే తెలంగాణ జిఎస్‌డిపి మెరుగ్గా ఉందని సిఎం తెలిపారు. జిఎస్టి వసూళ్లు గడిచిన రెండు నెలల్లో రూ.4 వేల కోట్లు దాటాయని తెలిపారు. విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తెస్తున్నామని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో మార్పులపై కమిటీ అధ్యయనం చేస్తోందని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులపై కమిషన్ నివేదికే ఫైనల్ కాదని.. జాతీయస్థాయి అధ్యయనం తర్వాత విద్యావ్యవస్థలో మార్పులు చేస్తామని అన్నారు.
అయితే ఈ మధ్య పోలీసులపై కాల్పులు జరిగినా బిజెపి నేతలు స్పందించలేదని సిఎం మండిపడ్డారు. పోలీసులపై కాల్పులు జరిగితే బిజెపి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా బిజెపి నేతలు మాట్లాడట్లేదని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి కలిసి ఉన్నారు అనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. హిల్ట్ పాలసీ, టిడిఆర్ భూబదలాయింపుపై సవాలు విసిరానని అన్నారు. ఏ ఏజెన్సీతో అయినా విచారణకు సిద్ధమని కెటిఆర్, హరీశ్ రావులకు సవాల్ చేశామని అన్నారు. హిల్ట్ పాలసీ వల్ల రూ.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదని పేర్కొన్నారు. అల్లుడు, కుమారుడు కలిసి కెసిఆర్‌ను గృహనిర్భంధం చేశారని.. అందుకే ఆయన అసెంబ్లీకి రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేశామని.. రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసి అప్పులు చెల్లించామని అన్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే వాడుకున్నామని స్పష్టం చేశారు.