Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈసారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు గాయాల పాలు కావడం అసంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పటికే గాయాల కారణంగా పాట్ కమ్మిన్స్, హేజిల్‌వుడ్ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ దూరం అవుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి.

గత ఏడాదిగా స్టార్క్‌పై తీవ్ర పని భారం పడిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. యాషెస్ సిరీస్‌లో స్టార్క్ అన్ని మ్యాచులు ఆడాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. అయితే టి-20లో వేసేది నాలుగు ఓవర్లే అయినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త బంతితో స్టార్క్ అద్భుతాలు చేస్తాడు. కానీ, అతడిపై పని భారం పెరిగే అవకాశం ఉందని.. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసీస్ బోర్డు భావిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో ‘రిటర్న్‌ టు ప్లే’ ప్రొటోకాల్స్‌ను అనుసరించి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వనుంది. దీంతో తొలి వారంలో స్టార్క్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌ని కొన్ని మ్యాచ్‌కు దూరం చేసుకున్న సన్‌రైజర్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా లీగ్ నుంచి నిష్క్రమించాడు. గాయం వల్ల అతడు పూర్తిగా దూరమైనట్లు ఎస్‌ఆర్‌హెచ్ వర్గాలు తెలిపాయి. అన్‌క్యాప్‌డ్ ఓవర్సీస్ ప్లేయర్‌గా గత వేలంలో రూ.3 కోట్లకు సన్‌రైజర్స్ అతడిని తీసుకుంది. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంలో క్లారిటీ లేదు.