
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుండగా హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని, ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్‌లో ఇస్తున్నారనరి దుయ్యబట్టారు. తొమ్మిది స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు కెఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చారని, అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో 4.99, దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలో 4.99 శాతం ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు నియజకవర్గాలలో 4.95% ఎక్సెస్‌లో టెండర్ కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో 4.77, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో 4 87, స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గంలో 4.89, శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 4.89 శాతం ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వలేదు కానీ, బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన వారికి ఇచ్చారని హరీష్ చురకలంటించారు. కెసిఆర్ హయాంలో అన్ని పథకాలు అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలు చేశామని, ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు.