Reading Time: 3 minutes

పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో బిజెపి తక్షణ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసోంను నిలుపుకోవడం, బెంగాల్‌ను గెలవడం లేదా కనీసం రాష్ట్రంలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం, కేరళ, తమిళనాడులలో తన పరిధిని విస్తరింప చేసుకోవడం. ఐదు రాష్ట్రాలలో అసోం మాత్రమే బిజెపి ప్రస్తుత ఎన్నికల కంఫర్ట్ జోన్‌లో దృఢంగా కనిపిస్తున్నది. ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా కేరళ, తమిళనాడులలో పార్టీ చరిత్రాత్మకంగా ఉనికి కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేయాల్సి వస్తున్నది. 2016 నుండి అధికారంలో ఉన్న అసోంను వరుసగా మూడోసారి గెలుపొందగలమని ధీమాతో బిజెపి ఉంది. తమిళనాడులో ఎఐఎడి ఎంకె నేతృత్వంలో చీలిక గ్రూపులను ఎన్‌డిఎలోకి తీసుకొచ్చి డిఎంకెను ఓడించాలనే ఎత్తుగడ బెడిసికొట్టిందని గ్రహించే అక్కడి గవర్నర్ ఆర్‌ఎన్ రవిని బెంగాల్‌కు పంపి ఆ రాష్ట్రంపై కసరత్తు చేస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డిజిపి, సిటీ పోలీస్ కమిషనర్ వంటి కీలక అధికారులను మార్చడం ద్వారా ఏదో విధంగా అక్కడ మమతా బెనర్జీని గద్దె దింపాలని అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్న బిజెపి, ఈసారి బెంగాల్ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) తన 15 ఏళ్ళ అధికారాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బెంగాల్ సంస్కృతి, అస్తిత్వాన్ని ప్రధాన అజెండాగా మార్చి బెంగాల్ కూతురుగా ప్రచారం సాగిస్తున్నారు. బిజెపిని బయటి పార్టీగా అభివర్ణిస్తూ, స్థానిక ఓటర్లలో సెంటిమెంట్ రగిలిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తృణమూల్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్దిసేపు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఎక్స్‌పోస్ట్‌లో నిన్న కోల్‌కతాలో జరిగిన ఆనందోత్సాహాల ర్యాలీ నుండి ముఖ్యాంశాలు! పశ్చిమ బెంగాల్ బిజెపికి మద్దతు ఇస్తోందని స్పష్టంగా తెలుస్తుంది.. అంటూ పేర్కొనడం గమనార్హం.

గత నెలలో రాష్ట్రంలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారంలో ఉన్నప్పటికీ అది సరిపోదు అని స్పష్టం చేశారు. బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ కార్యకర్తల ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది అని ఆయన ప్రకటించారు. అయినప్పటికీ బెంగాల్ ఎన్నికలు అత్యంత జటిలమైన ఎన్నికల పోరాటం కాగలదని బిజెపి నాయకులు ప్రైవేట్‌గా అంగీకరిస్తున్నారు. మమతా ప్రజాకర్షణ, పథకాల అమలులో ఆమె పాలనా నైపుణ్యం ముందు తట్టుకోవడం సాధ్యం కావడం లేదని చేతులెత్తేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో, గత దశాబ్దంలో సాధించిన పురోగతి ఆధారంగా విజయం వైపుకు దూసుకుపోయే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. అయితే, పార్టీ తన పెరుగుదలను అసెంబ్లీ విజయంగా మార్చుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో దాని అద్భుతమైన ప్రదర్శన నుండి క్రమంగా ఆ పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచార కేసు, షేక్ షాజహాన్ ఉదంతం వంటి వివాదాలను ఎదుర్కొంది.

అయినప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనుకూలంగా గ్రామీణ మహిళలకు నగదు బదిలీని అందించే లక్ష్మీర్ భండార్ వంటి సంక్షేమ పథకాల ప్రజాదరణ నెలకొంది. పశ్చిమబెంగాల్ జనాభాలో ముస్లింలు 27% మంది ఉండటంతో జనాభా కూడా బిజెపికి సవాలుగా ఉంది. టిఎంసి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అవినీతి, అధికార వ్యతిరేకత, బెంగాల్ అంతటా హిందూ ఏకీకరణ అవకాశం వంటి అంశాల చుట్టూ ఎన్నికలను రూపొందించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అసోం లో పార్టీ దీర్ఘకాల రాజకీయ ప్రణాళిక – బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు వ్యతిరేకత, వలసలతో ముడిపడి ఉన్న ఆర్థిక, సాంస్కృతిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్న అస్సామీ హిందువులలోని వర్గాలతో ప్రతిధ్వనించింది. బెంగాలీ మాట్లాడే ముస్లింల ఓటింగ్ సరళి మరో కీలక అంశం కాగలదు. వారి ఓట్లు కాంగ్రెస్, బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ ఎఐయుడిఎఫ్‌ల మధ్య చీలిపోతే, అది బిజెపి వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బిజెపికి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ వెనుక ఏకీకృతం కావడంతో బిజెపికి ఇబ్బందికరంగా మారింది. రకీబుల్ హుస్సేన్ 10 లక్షలకుపైగా ఓట్ల తేడాతో గెలవడానికి ఇది సహాయపడింది.

ఇపుడు కాంగ్రెస్ ఆయా వర్గాలను సమీకరించుకోవడం ద్వారా బిజెపిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన పదవీకాలంలో దూకుడుగా హిందూత్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల, ముస్లింలను శర్మ తుపాకీతో లక్ష్యంగా చేసుకుని ఎఐ -సృష్టించిన వీడియో తీవ్ర విమర్శలకు దారితీయడంతో బిజెపి తన అధికార వెబ్‌సైట్‌నుంచి తొలగించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అసోం జనాభాలో ముస్లింలు దాదాపు 34% ఉన్నారు. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వెనుక ఏకీకృతమైతే, పోటీ గణనీయంగా కఠినతరం కావచ్చు. శర్మ పాలన రికార్డు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన శాంతి భద్రతల కథనాన్ని బిజెపి నాయకులు ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. కేరళ బిజెపికి కష్టతరమైన ప్రాంతంగా మిగిలింది. అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో, నటుడు సురేష్ గోపి త్రిస్సూర్ స్థానాన్ని బిజెపి తరపున గెలుచుకున్నారు. ఇది రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. తదనంతరం, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలమైన ప్రదర్శన ఇచ్చింది.రాష్ట్ర రాజధానిలో మేయర్ పదవిని కూడా దక్కించుకుంది. అయినా, కేరళలో బిజెపి నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొంటోంది.

రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ జనాభా కలిపి దాదాపు 45% ఉంది, దీనివల్ల పార్టీ తన ఎన్నికల స్థావరాన్ని గణనీయంగా విస్తరించుకోవడానికి హిందూ ఏకీకరణ సరిపోదు. పాలక సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) కూడా హిందూ ఓటర్లను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు బిజెపి ఎదుగుదలను అడ్డుకొంటున్నది. గత సంవత్సరం గ్లోబల్ అయ్యప్ప సంగమం వద్ద, ఒక మంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి ఒక సందేశాన్ని చదివారు. ఇది అసాధారణమైన సంజ్ఞ. తాజాగా, అయ్యప్ప మందిరంలో మహిళల ప్రవేశంపై లెఫ్ట్ ప్రభుత్వం ఆంక్షలకు ఆమోదం తెలిపింది. మరోవంక, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పుకోదగిన ఫలితాలు పొందడంతో ఆ పార్టీ చేతిలోకి మరో రాష్ట్రం వెళ్లకుండా పరోక్షంగా ఎల్‌డిఎఫ్‌కు సానుకూలంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుండి పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం పేరు మార్పుకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇదే విషయమై బెంగాల్ అభ్యర్థనను పక్కన పడవేయడం అందుకు నిదర్శనం.

తమిళనాడులో ద్రవిడ ఉద్యమ వారసత్వం రాష్ట్ర రాజకీయాలను నిర్దేశిస్తున్నది. బిజెపిని, దాని ప్రత్యర్థులు తరచుగా ఉత్తరాది పార్టీగా చిత్రీకరిస్తున్నారు. దానితో ‘తమిళ వ్యతిరేక’ ముద్రను చెరిపివేసుకోవడం కోసం బిజెపి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. మాజీముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత బలహీనపడిన తన మిత్రపక్షమైన అన్నాడిఎంకెపై బిజెపి ఎక్కువగా ఆధారపడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకున్న పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా, ఈ ఫలితంవల్ల కలిగే రాజకీయ పరిణామాలు ఆ పార్టీకి చాలా పరిమితం. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, బిజెపి నాయకత్వం అసోం పట్ల అత్యంత నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆయా రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక రాజకీయ, పరిపాలన సంబంధ అంశాలతో పాటు ఇరాన్ యుద్ధంతో తలెత్తుతున్న ఆర్థిక ఆందోళనలు, పెరుగుతున్న ఎల్‌పిజి ధరలు, పరిష్కారం కాని అమెరికాతో వాణిజ్య చర్చలు కూడా ఓటర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఎల్‌పిజి, చమురు సరఫరాలో కొరత లేదని నిత్యం ప్రభుత్వం చెబుతున్నా దేశవ్యాప్తంగా ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వారాలు గడిస్తే పరిస్థితులు సర్దుబాటు అవుతాయనే ఉద్దేశంతోనే బెంగాల్ ఎన్నికలను ఏప్రిల్ చివరిలో జరుపుతున్నారని స్పష్టం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా బిజెపికి జాతీయ స్థాయిలో సవాలుతో కూడిన సమయంలో వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం మే నెలలో తన మూడవ పదవీకాలంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఓ బలమైన నాయకుడిగా జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో ఆయన నిలదొక్కుకోలేకపోవడంతో ఈ ఎన్నికలలో ఆయన ప్రచార ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.

– చలసాని నరేంద్ర

98495 69050