Reading Time: 3 minutes

బడ్జెట్‌లో బిసిలకు న్యాయం చేయాలి, కేటాయించిన నిధులు పూర్తిగా విడుదల చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. ఈ డిమాండ్లతో ధర్నాలు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. బిసి సమాజంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం. బడ్జెట్ అంటే కేవలం లెక్కల సమాహారం కాదు.. ప్రజల ఆశయాలకు అద్దంపట్టే రాజకీయ పత్రం. నిజానికి బడ్జెట్ అనేది ఆదాయ- వ్యయాల పట్టిక మాత్రమే కాదు. ఒక రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక- ఆర్థిక దిశానిర్దేశం. అందుకే బడ్జెట్‌ను అంకెల గణితం కాదు -న్యాయం, ప్రాధాన్యత, పాలనా సంకల్పానికి ప్రతిబింబంగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రజల్లో ఆశలు రేపింది. దాని అంతరార్థం, వనరుల సమాన పంపిణీ, అవకాశాల్లో సమానత్వం, బహుజనులకు న్యాయం. కానీ దశాబ్దం గడిచినా నిధులు అనే అంశం బిసిలకు అందని ద్రాక్షగానే మిగిలింది. 2014-15లో రూ. 1 లక్ష కోట్ల బడ్జెట్. 2025- 26 నాటికి రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంది.

అయితే అదే నిష్పత్తిలో బిసిల అభివృద్ధిపై ఖర్చు పెరగలేదు. ఇది సాధారణ లోపం కాదు, నిర్మాణాత్మక అన్యాయం. సంఖ్యలు పెరిగినా.. న్యాయం పెరగకపోతే ఆ అభివృద్ధికి అర్థం ఏమిటి? 2014 నుంచి 2023 వరకు బిఆర్‌ఎస్ పాలనలో కేటాయింపు రూ.44,940 కోట్లు, ఖర్చు రూ.26,645 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో గత రెండు సంవత్సరాల్లో కేటాయింపు రూ. 21,600 కోట్లు, ఖర్చు సుమారు రూ. 5,000 కోట్లు. కార్పొరేషన్ల పతనం- స్వయం ఉపాధికి దెబ్బ. బిసి కార్పొరేషన్లు 2014-23 లో రూ. 2,642 కోట్లు కేటాయించారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 1,363 కోట్లు ఖర్చు చేశారు. విడుదల సున్నా. ఎంబిసి కార్పొరేషన్లు 2017- 23లో రూ. 4,100 కోట్లు కేటాయించారు. రూ. 21 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 810 కోట్లు. బిసి కాస్ట్ ఫెడరేషన్లు 2014- 23లో రూ. 1,994 కోట్లు కేటాయించారు. రూ. 315.84 కోట్లు ఖర్చు చేశారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 2,245 కోట్లు. ఈ పరిస్థితి వల్ల స్వయం ఉపాధి అవకాశాలు క్షీణించాయి. ఇది కేవలం ఆర్థిక లోటు కాదు, సామాజిక న్యాయానికి ఎదురు దెబ్బ. సమస్య డబ్బుల కొరత కాదు.. ప్రాధాన్యతలలో పక్షపాతం

ప్రభుత్వం చెబుతోంది -రెవెన్యూ సరిపోవడం లేదు అని. కానీ వాస్తవం ఏమిటి? భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు డబ్బు ఉంది. ప్రచార ఆర్భాటాలకు డబ్బు ఉంది. ఆడంబరాల ఈవెంట్లకు డబ్బు ఉంది. కానీ బిసి స్వయం ఉపాధికి డబ్బు లేదు. కార్పొరేషన్లకు విడుదలకు డబ్బులు లేవు. అంటే సమస్య వనరుల కొరత కాదు, బిసి లంటే చిన్న చూపు. వారు ఏమీ చేయలేరనే అహంకార భావన. రైతు పథకాలలో అసమానత, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలలో బిసిల కంటే ఒసిలకే ఎక్కువ లబ్ధి అందుతోంది. తెలంగాణలో సుమారు 50 లక్షల మంది భూమిలేని బిసి కుటుంబాలు ఉన్నాయి. వారికి ఈ పథకాల ద్వారా ఒక్క రూపాయి కూడా అందడం లేదు. అయితే వారు ఎలా ఎదగాలి? ఇదే అసలు ప్రశ్న. పారదర్శకత లేకుండా సంక్షేమం అర్థరహితం. మా ప్రధాన డిమాండ్లు: సంక్షేమ పథకాలలో కులవారీ డేటా విడుదల చేయాలి. ఎవరికెంత లబ్ధి అందిందో వెల్లడించాలి. ఆ లెక్కలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమానత్వం అంటే భూమి ఎక్కువ ఉంటే ఎక్కువ భూమి లేని నిరుపేద చేతివృత్తుల వారికి సున్న అనేది సామాజిక న్యాయం కాదు. కామారెడ్డి హామీ -అమలులో వైఫల్యం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్లు, ఐదు సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లు. వాస్తవంగా గత రెండు సంవత్సరాల్లో చేసిన ఖర్చు కేవలం రూ. 5,000 కోట్లు. ఇంకా రూ. 20,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది.

ముందున్న బడ్జెట్- మళ్లీ అదే గారడీనా? మళ్లీ భారీ కేటాయింపులు ప్రకటించే అవకాశం ఉంది.కానీ ప్రజల ప్రశ్న ఒకటే. ఈసారి నిధులు నిజంగా విడుదల అవుతాయా? లేక మళ్లీ అంకెల గారడీగానే మిగిలిపోతాయా? ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు: ఆడంబరాల ఖర్చులు తగ్గించాలి. ప్రచార వ్యయాలను నియంత్రించాలి. ఆ నిధులను బిసి సంక్షేమానికి మళ్లించాలి. రైతు పథకాల కోసం అప్పులు తెచ్చినట్లే- బిసిల సంక్షేమానికి కూడా నిధులు సమకూర్చాలి. మా డిమాండ్లు: బిసిలకు కేటాయించిన నిధులు 100% విడుదల చేయాలి. జ్యోతిబా ఫూలే సబ్ ప్లాన్ అమలు చేయాలి. బిసి కార్పొరేషన్లకు కనీసం రూ. 50,000 కోట్లు కేటాయించాలి. స్వయం ఉపాధి పథకాలను పునరుద్ధరించాలి.

కులవారీ లబ్ధిదారుల డేటా విడుదల చేయాలి. జనాభా నిష్పత్తిలో బిసిలకు బడ్జెట్ వాటా ఇవ్వాలి. బిసిలను కేవలం ఓటుబ్యాంక్‌గా ఉపయోగించడం ఇక ఆగాలి. బడ్జెట్‌లో న్యాయం జరగకపోతే- తెలంగాణ రైజింగ్ 2047, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వంటి లక్ష్యాలు బిసిలకు అర్థరహితంగా మారిపోతాయి. ఇప్పటికే ఆర్థిక అసమానతలు పెరిగాయి. బిసిలు ప్రభుత్వ తాయిలాల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్‌లో అంకెలు కాదు, నిజంగా నిధుల విడుదలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బడ్జెట్‌లో బిసిలకు వాటా ఇవ్వడం ఉపకారం కాదు, -అది వారి హక్కు. కేటాయింపులు చేసి విడుదల చేయకపోవడం, ప్రకటనలు చేసి అమలు చేయకపోవడం, ఇది పరిపాలనా వైఫల్యం కాదు, ప్రజలను మోసం చేసే రాజకీయ ధోరణి. ఇక ప్రశ్న ఒక్కటే, బిసిలు మళ్లీ మోసపోతారా? లేక తమ హక్కుల కోసం సంఘటితంగా నిలబడి చరిత్రను మార్చుతారా? నిధులు అడుగుతున్నది కాదు.- తమ హక్కు, తమ వాటా, తమ గౌరవం కోరుతున్నారు. 

– టి. చిరంజీవులు

విశ్రాంత ఐఎఎస్,

(బిసి మేధావుల ఫోరం చైర్మన్)