Reading Time: 2 minutes

ప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం చెప్పుకోదగిన విశేషం. సామాజిక, ఆర్థిక నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక నివేదికలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. 202324 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026’ నివేదికలో దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక నిర్వహణ గల రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తూ తెలంగాణ 8వ స్థానం నుండి 7వ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ‘ఫ్రంట్ రన్నర్’ హోదాను కూడా నిలబెట్టుకుంది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ నివేదిక ప్రకారం ఒడిశా, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు ‘టాప్ అచీవర్స్’ (అగ్ర స్థాయి సాధకులు) వర్గంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలు బలమైన ఆర్థిక క్రమశిక్షణ, సొంత పన్ను ఆదాయం, తక్కువ ద్రవ్యలోటు, అప్పుల నిర్వహణలో మెరుగైన పద్ధతిని ప్రదర్శించాయి. ‘అత్యల్ప ఆకాంక్షిత’ (లోయెస్ట్ ఆస్పిరేషనల్) వర్గంలో కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.

దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి నీతి ఆయోగ్ నాలుగు విస్తృత విభాగాలుగా వర్గీకరించింది. అచీవర్స్ (సాధకులు టాప్ టైర్), ఫ్రంట్ రన్నర్స్, పెర్ఫార్మెర్స్, ఆస్పిరేషనల్ (ఆకాంక్షిత) అనే నాలుగు కేటగిరీలుగా సమీక్షించింది. ఫ్రంట్ రన్నర్ వర్గం అంటే సాధారణంగా మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉన్న రాష్ట్రాలు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఫ్రంట్ రన్నర్ వర్గంలో నిలిచాయి. ‘కాలక్రమేణా తెలంగాణ ఆర్థిక నిర్వహణ మెరుగుపడింది. జాతీయ సగటు కంటే అధిక వృద్ధి రేటు, సొంత పన్నుల రాబడి పెంపుదల, సంక్షేమ, అభివృద్ధి పథకాల సమతుల్యత, ఇవన్నీ తెలంగాణ ఆర్థిక సూచిక ఎదగడానికి కారణాలు. ఈ రాష్ట్రం తన స్వంత ఆదాయ వనరులను మెరుగుపర్చుకోవడంలో, సబ్సిడీ చెల్లింపును సమతుల్యం చేయడంలో నిలకడైన ప్రగతిని కనబర్చింది. అయితే రెవెన్యూ లోటును నియంత్రించాల్సి ఉందని, అప్పుల ద్వారా కాకుండా స్వంత ఆదాయ వనరుల ద్వారానే ఖర్చులను భరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫిస్కల్ హెల్త్ ఇండెక్సులో 44.3 పాయింట్లు స్కోరు చేసి 8వ స్థానం నుంచి 7వ స్థానానికి తెలంగాణ ఎదగ్గా, దీనికి విరుద్ధంగా 23.1 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాలు ప్రజాధనాన్ని ఎంత సమర్థవంతంగా ఖర్చు చేస్తున్నాయో కూడా ఈ సూచిక పరిశీలించింది. అభివృద్ధి పనులు, మూలధన వ్యయంపై సమర్థవంతంగా ఖర్చు చేస్తున్నట్టు తేలడంతో 57.1 పాయింట్ల స్కోరుతో ‘అచీవర్ కేటగిరీ’ ని తెలంగాణ సాధించింది. అప్పుల నిర్వహణలో కూడా 53.5 పాయింట్ల స్కోరుతో తెలంగాణ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. తక్కువ వడ్డీ, ఇవిఎంల ఒత్తిడి విషయంలో ఆదాయానికి, అప్పులకు మధ్య సరైన సమతుల్యత పాటించింది. రుణస్థిరత్వం అన్నది అనేక రాష్ట్రాలకు ఆందోళనకరమైన అంశంగా ఉంటున్న నేపథ్యంలో ఈ సూచికలో తెలంగాణ 20.0 పాయింట్లు సాధించగా, ఆంధ్రప్రదేశ్ కేవలం 4.2 పాయింట్లు మాత్రమే సాధించగలగడం గమనార్హం.

రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి ఆస్కారం ఉందని ఈ నివేదిక సూచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తోంది. 2019 20 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,860 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం 2023 నాటికి రూ. 43,918 కోట్లకు పెరిగి, ఐదేళ్లలో 160 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ గణనీయమైన పెరుగుదల రాష్ట్రంలో ఆస్తుల సృష్టిని, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూనే హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇంత భారీ వ్యయం ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రుణపరిమితులను నియంత్రణలో ఉంచిందని చెబుతున్నారు.

రుణజిఎస్‌డిపి నిష్పత్తిని 30% కంటే తక్కువగా అంటే సుమారు 2728 శాతం కొనసాగిస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయిలో రూ. 60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఇవన్నీ రాష్ట్రంలో ఆస్తుల సృష్టిని, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చొరవను బలపరుస్తున్నాయి. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలు, ఐటి రంగం విస్తరణ, మున్సిపల్ శాఖల్లో పెట్టుబడులు ప్రధానంగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆర్థికాభివృద్ధిలో స్థిరమైన ప్రగతి కనిపిస్తోంది. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగి రూ. 3.87 లక్షలకు చేరుకుంది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. పర్యాటకం, పరిశ్రమలు, క్రీడలు, సామాజిక సమ్మిళిత్వంతో సమగ్ర విధానాలను అమలు చేస్తోంది. ఆర్థిక నిర్వహణ సమర్థ్ధవంతంగా ఉండడం, పన్నుల వసూలులో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు సరైన ప్రాధాన్యత కల్పించడం ఇవన్నీ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే లక్షానికి ఊతం ఇస్తున్నాయి.