
ప్రస్తుత రాజ్యసభలో 73 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సభలో 32 శాతం మంది వరకూ క్రిమినల్ చరిత్ర ఉందని వెల్లడైంది. కాగా ఈ సభలో 31 మంది బిలియనీర్లు ఉన్నారు. సంబంధిత వివరాలను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) తమ నివేదికలో తెలిపింది. మొత్తం 233 మంది ఎంపీలలో 229 మంది అఫిడవిట్ల పరిశీలన క్రమంలో సభ్యుల రికార్డులు తెలిసివచ్చాయి. ఇటీవలే ఎన్నికైన రాజ్యసభ ఎంపీల అఫిడవిట్ల విశ్లేషణ కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. రాజ్యషభలో 14 శాతం వరకూ పరమ కోటీశ్వరులు ఉన్నట్లు నిర్థారణ అయింది. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఒక్క సీటు ఖాళీ ఉంది. ముగ్గురు ఎంపీల వివరాలు వెలుగులోకి రాలేదని ఎడిఆర్ తెలిపింది. ఇక క్రిమినల్ రికార్డులు ఉన్న వారిలో 73 మంది అంటే 32 శాతం వరకూ తమపై తీవ్ర అభియోగాలు ఉన్నట్లు తెలియచేసుకున్నారు.
ఓ ఎంపీపై హత్య కేసు, నలుగురిపై హత్యాయత్నం కేసులు , ముగ్గురిపై మహిళలపై అఘాయిత్యాల కేసులు ఉన్నాయి. ఇక పార్టీల వారిగా చూస్తే బిజెపి ఎంపీలలో 99 మందిలో 27 మందిపై కేసులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్‌కు చెందిన 28 మంది సభ్యులలో 12 మందిపై, టిఎంసికి చెందిన 13 మందిలో నలుగురుపై, టిఎంసికి చెందిన పది మందిలో నలుగురుపై కేసులు ఉన్నాయి. బిఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపిపై క్రిమినల్ కేసు ఉంది. సిపిఎంకు చెందిన ముగ్గురు ఎంపిలపై కేసులు రికార్డు అయి ఉన్నాయి. ఇక ఆస్తుల విషయానికి వస్తే బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన బండి పార్థసారథికి అత్యున్నత స్థాయిలో రూ 5300 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. తరువాతి క్రమంలో ఆప్ సభ్యులు రాజీందర్ గుప్తాకు రూ 5053 కోట్లు, వైఎస్‌ఆర్‌సిపి ఆళ్ల అయోధ్యరామి రెడ్డికి రూ 2577 కోట్లు ఉన్నాయి. ఆప్ ఎంపి సంత్ బల్బీర్ సింగ్ తమ ఆస్తుల విలువ దాదాపు 3 లక్షలని తెలియచేసుకున్నారు. ఎంపిల ఆస్తుల విలువ చూస్తే ఆయనే నిరుపేద అని తేలింది.