
తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత త్వరలో పార్టీ ప్రారంభించన్నారు. ఇప్పటికే పార్టీ పేరు నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇసి దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లికేషన్‌లో చాలా లోపాలున్నాయంటూ కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపామని ఇసి తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.
ఆ సమయంలో కవిత తరఫు న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడింది. అదే పిటిషన్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఇసి కోర్టుకు చెప్పగా, లోపాలన్నీ సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులు సరిచేసి ఇసికి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. దీంతో ఈసీ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో ఢిల్లీ హైకోర్టు విచారణ ముగించింది.