
గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త అధికంగానే సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బడ్జెట్‌లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం. ఇక, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం ఈ బడ్జెట్‌లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్‌పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బిసిలకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో దీనికోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.